భక్తిశ్రద్ధలతో సూర్యోపాసన సేవ..
- లోకకల్యాణం.. భక్తుల క్షేమమే లక్ష్యంగా ప్రత్యేక పూజలు
- అరుణ, మహాసౌర పారాయణాలతో మార్మోగిన ఇంద్రకీలాద్రి
- సూర్య అష్టోత్తర శతనామావళితో ఆదిత్యునికి విశేష అర్చనలు
- సూర్యభగవానుడి అనుగ్రహం కోసం శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు
- అనంతరం కనకదుర్గమ్మవారికి ప్రత్యేక హారతులు.. భక్తులకు ప్రసాదాలు
( ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ ) : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఆదివారం సూర్యోపాసన సేవ భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా ఆదివారం నిర్వహించారు. లోకకల్యాణం, సమస్త భక్తుల క్షేమం, ఆరోగ్య ఐశ్వర్యాల కోసం ఆలయ వేద పండితులు శాస్త్రోక్తంగా సూర్యభగవానుడిని ఆరాధించారు.

ఆలయ వేద పండితులు అరుణ పారాయణం, మహాసౌర పారాయణంతో పాటు సూర్య అష్టోత్తర శతనామావళిని భక్తిశ్రద్ధలతో పఠిస్తూ ఆదిత్యునికి ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. సూర్యభగవానుడి ఆరాధన భారతీయ సనాతన సంప్రదాయంలో విశిష్టమైనదని, సూర్యోపాసన వల్ల ఆరోగ్యం, తేజస్సు, మానసిక ప్రశాంతత కలుగుతాయని పండితులు పేర్కొన్నారు.
సూర్యోపాసన సేవ అనంతరం ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మవారికి ప్రత్యేక హారతులు సమర్పించారు. అమ్మవారి అనుగ్రహం కోసం భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, అర్చకులు, వేద పండితులు, ఆలయ సిబ్బందితో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆదిత్యుని ఆరాధన.. కనకదుర్గమ్మవారి సన్నిధి.. వేద మంత్రఘోషల నడుమ ఇంద్రకీలాద్రిపై ఆదివారం ఆధ్యాత్మిక వైభవం వెల్లివిరిసింది.

