కడెం ప్రాజెక్ట్ నీటిలో పడి యువకుడు గల్లంతు..
కడెం, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని కడెం ప్రాజెక్టు జలాశయం వద్ద గురువారం సాయంత్రం ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయి ఓ యువకుడు గల్లంతైన ఘటన చోటుచేసుకుంది.
అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ పట్టణం శాంతినగర్ కాలనీకి చెందిన మంగ శ్రీను (38) ఈ నెల 4వ తేదీ సాయంత్రం కడెం ప్రాజెక్టును సందర్శించేందుకు వచ్చాడు. ప్రాజెక్టు సమీపంలోని మిషన్ భగీరథ ఇంటెక్ వెల్ వద్ద గల జలాశయం వద్ద బహిర్భూమికి వెళ్లి కాళ్లు కడుక్కుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు నీటిలో జారిపడి గల్లంతయ్యాడు.
గల్లంతైన మంగ శ్రీను నిర్మల్ జిల్లా లక్ష్మణచందా మండలం పారుపల్లి విద్యుత్ సబ్‌స్టేషన్‌లో ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కడెం ప్రాజెక్టు వద్దకు చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. గల్లంతైన శ్రీను కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నప్పటికీ ఆయన ఆచూకీ ఇంకా లభించలేదని అధికారులు తెలిపారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
