ఫిన్లాండ్ లో స్వదేశీ సాఫ్ట్వేర్ ఉద్యోగి స్వాగతం..

జన్నారం, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం తరఫున విదేశీ విద్యా విధానంపై అధ్యయనం చేసేందుకు ఫిన్లాండ్ వెళ్లిన ఉపాధ్యాయులను అక్కడ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న స్థానికుడు ఆత్మీయంగా కలుసుకుని స్వాగతం పలికారు. విదేశీ విద్యా విధానాన్ని అభ్యసించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మొత్తం 28 మంది ఉపాధ్యాయులు ఫిన్లాండ్‌కు వెళ్లగా, వారిలో జన్నారం మండలానికి చెందిన ఇద్దరు ఉపాధ్యాయులు కూడా ఉన్నారు.

మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కిష్టాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న దాముక కమలాకర్, అలాగే పొనకల్ గ్రామపంచాయతీ పరిధిలోని అక్కపల్లిగూడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జాజాల శ్రీనివాస్‌ను ఫిన్లాండ్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న పొనకల్ గ్రామానికి చెందిన దాసరి రాజేష్ సోమవారం మర్యాదపూర్వకంగా కలుసుకుని పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతించారు.

ఈ నెల 20 నుంచి 24 వరకు ఫిన్లాండ్‌లోని వివిధ ప్రాంతాలలో విద్యా ప్రముఖులను కలుసుకుని అక్కడి విద్యా విధానాన్ని అధ్యయనం చేయనున్నట్లు ఉపాధ్యాయులు తెలిపారు. ఈ సందర్భంగా దాసరి రాజేష్ మాట్లాడుతూ, విదేశీ నేలపై స్వదేశీ ఉపాధ్యాయులను కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఫిన్లాండ్ విద్యా విధానాన్ని తెలంగాణలో అమలు చేస్తే విద్యార్థులు అన్ని రంగాల్లో ముందంజలో ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply