కేటీకే-8లో వెయ్యి మొక్కలు నాటిన జీఎం

కేటీకే-8లో వెయ్యి మొక్కలు నాటిన జీఎం

  • పర్యావరణ దినోత్సవం.. మొక్కలతో సందేశం..
  • ప్రకృతి పరిరక్షణకు ఉద్యోగుల ప్రతిజ్ఞ

భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ : ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సింగరేణి భూపాలపల్లి ఏరియా ఆధ్వర్యంలో శుక్రవారం పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కేటీకే-8 ఇంక్లైన్, రెస్క్యూ స్టేషన్‌ ప్రాంగణాల్లో జరిగిన కార్యక్రమాలకు ఏరియా జనరల్ మేనేజర్ రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలంటే మొక్కల పెంపకం, నీటి సంరక్షణ, ప్లాస్టిక్ వినియోగ నియంత్రణ వంటి చర్యలను ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం, పర్యావరణ పరిరక్షణపై ప్రతిజ్ఞ చేయించడం, పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా కేటీకే-8 ఇంక్లైన్‌లో జనరల్ మేనేజర్ రాజేశ్వర్ రెడ్డి స్వయంగా వెయ్యి మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణకు తమ సంస్థ కట్టుబడి ఉందని చాటిచెప్పారు. ప్రకృతి వనరుల సంరక్షణతోనే పర్యావరణ సమతుల్యత సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరూ పచ్చదనాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వివిధ డిపార్ట్మెంట్ల అధికారులు, జీఎం కార్యాలయ సిబ్బంది, రెస్క్యూ సిబ్బంది పాల్గొన్నారు

Leave a Reply