AP | పవన్ కల్యాణ్ సూచనలతో ముందుకు సాగాలి

AP | పవన్ కల్యాణ్ సూచనలతో ముందుకు సాగాలి
- గోదావరి పుష్కరాలు 2027 పై సీఎం సమీక్ష…
అమరావతి: 2027లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయే గోదావరి పుష్కరాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ‘అఖండ గోదావరి అభివృద్ధి ప్రాజెక్టు’పై మంత్రుల కమిటీ, వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలిసి సీఎం సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఇటీవల ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ క్షేత్రస్థాయిలో పర్యటించి ఇచ్చిన కీలక సూచనలను, సిఫార్సులను పరిగణనలోకి తీసుకుని పుష్కరాల పనులు ముందుకు తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు.
పుష్కరాల నిర్వహణను కేవలం తాత్కాలిక ఏర్పాట్లకే పరిమితం చేయకుండా, గోదావరి పరివాహక ప్రాంతానికి శాశ్వత ఆస్తిగా మారేలా మౌలిక వసతులు కల్పించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే చారిత్రాత్మక రాజమహేంద్రవరం (రాజమండ్రి) నగరాన్ని ఒక అంతర్జాతీయ స్థాయి మెగాసిటీగా అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పయ్యావుల కేశవ్, పి.నారాయణ, హోం మంత్రి వంగలపూడి అనిత, జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడుతో పాటు సీఎస్ సాయిప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
