యోగాను ఉద్యమంగా మార్చాలి..
యోగాను ఉద్యమంగా మార్చాలి..
యోగాంధ్ర విజయవంతానికి మాస్టర్ ట్రైనర్లే కీలకం
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ: ప్రతి పౌరుడు యోగాను తన దైనందిన జీవితంలో భాగం చేసుకున్నప్పుడే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘యోగాంధ్ర’ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో మాస్టర్ ట్రైనర్ల పాత్ర అత్యంత కీలకమని ఆమె పేర్కొన్నారు.
శనివారం కర్నూలు ఔట్‌డోర్ స్టేడియంలో నిర్వహించిన మాస్టర్ ట్రైనర్ల శిక్షణా కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా యోగా ప్రాముఖ్యత, ప్రజారోగ్యంపై దాని ప్రభావం, గ్రామీణ స్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని వివరించారు.
గ్రామాల దాకా యోగా చైతన్యం
మాస్టర్ ట్రైనర్లు శిక్షణ పొందడానికే పరిమితం కాకుండా, ప్రతి గ్రామంలో యోగా సాధనపై ప్రజలకు అవగాహన కల్పించి ఆరోగ్యకర జీవనశైలిని అలవరచుకునేలా ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు. యోగా ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, ఒత్తిడి నియంత్రణ సాధ్యమవుతాయని తెలిపారు.
క్రమశిక్షణతో శిక్షణ పూర్తి చేయాలి
రెండు రోజుల పాటు నిర్వహించే శిక్షణా కార్యక్రమానికి ప్రతి మాస్టర్ ట్రైనర్ తప్పనిసరిగా హాజరై పూర్తి స్థాయిలో శిక్షణ పొందాలని కలెక్టర్ సూచించారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను గ్రామస్థాయి ట్రైనర్లకు సమర్థవంతంగా బోధించి యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కోరారు.
యోగాను కేవలం వ్యాయామంగా కాకుండా ప్రజా ఆరోగ్య ఉద్యమంగా మార్చి ప్రతి ఇంటికి చేరవేయాలని ఆమె పిలుపునిచ్చారు.
విద్యాశాఖపై కీలక బాధ్యత
యోగాంధ్ర కార్యక్రమం సమర్థవంతంగా అమలయ్యేలా జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలలు, గ్రామస్థాయి వేదికల ద్వారా యోగా సాధనను ప్రజల్లో ప్రోత్సహించాలని సూచించారు.

ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా
ప్రస్తుత జీవనశైలిలో పెరుగుతున్న ఒత్తిడి, అనారోగ్య సమస్యలను అధిగమించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తోందని కలెక్టర్ పేర్కొన్నారు. యోగా ద్వారా వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు సమాజంలో ఆరోగ్య చైతన్యం పెంపొందుతుందని, యోగాంధ్ర కార్యక్రమం ఆ లక్ష్య సాధనకు దోహదపడుతుందని చెప్పారు.

కార్యక్రమంలో సెట్కూర్ సీఈవో వేణుగోపాల్, జిల్లా విద్యాశాఖ అధికారి సుధాకర్, సర్వశిక్ష అభియాన్ పీవో లోకరాజ్, యోగాంధ్ర ఆయుష్ జిల్లా నోడల్ అధికారి డా. అమర్నాథ్, ఆయుష్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ డా. చంద్రిక, రాష్ట్ర యోగా సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్ శెట్టి, డిప్యూటీ డీఈఓ శ్రీధర్‌బాబు, ఎంఈఓలు, యోగా శిక్షకులు పాల్గొన్నారు.
