ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం..

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం..

పార్టీ బలోపేతమే లక్ష్యం
ప్రజలకు, ప్రభుత్వానికి వారధులుగా కార్యకర్తలు నిలవాలి
ఎమ్మెల్యే గొండు శంకర్ పిలుపు

గార(శ్రీకాకుళం), ఆంధ్రప్రభ : శ్రీకాకుళం నియోజకవర్గం గార మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన మండల స్థాయి విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ హాజరయ్యారు పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, రాబోయే రోజుల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై, ప్రభుత్వ లక్ష్యాలపై స్పష్టమైన మార్గనిర్దేశం చేశారు. ముఖ్యంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి వైపు వేగంగా అడుగులు వేస్తోందని, ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మార్చడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని ఎమ్మెల్యే అన్నారు .

మండలంలోని ప్రతి గ్రామంలో రోడ్ల నిర్మాణం, మురుగునీటి పారుదల వ్యవస్థ మెరుగుదల, సురక్షితమైన తాగునీటి సరఫరా వంటి ప్రాథమిక అవసరాలను తీర్చడానికి ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయిస్తోందని వివరించారు. ముఖ్యంగా మే నెలలో 27, 28 29 తేదీల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే మన ముందున్న తక్షణ కర్తవ్యమని ఆయన ఉద్ఘాటించారు. ఈ మూడు రోజుల పాటు జరిగే పండుగలో గార మండలం నుండి పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి, పార్టీ సత్తాను చాటాలని పిలుపునిచ్చారు. మహానాడు అనేది కేవలం పార్టీ కార్యక్రమం మాత్రమే కాదని, అది కార్యకర్తల ఆత్మగౌరవ వేదిక అని ఆయన తెలిపారు .

విద్య, వైద్య రంగాల్లో జరుగుతున్న మార్పులను ప్రజలకు వివరించి, ప్రభుత్వ ఆసుపత్రులలో, పాఠశాలల్లో అందుతున్న మెరుగైన సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకునేలా చూడాలని కోరారు. సంక్షేమ పథకాల అమలు విషయంలో కార్యకర్తలు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. అర్హత ఉండి ఏ ఒక్క లబ్ధిదారుడు కూడా పథకాలకు దూరం కాకూడదని, అటువంటి వారిని గుర్తించి వారికి అండగా నిలవాల్సిన బాధ్యత క్షేత్రస్థాయి నాయకులపై ఉందని గుర్తుచేశారు. గ్రామాల్లో తలెత్తే ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సకాలంలో పరిష్కారం అయ్యేలా ఒత్తిడి తీసుకురావాలని ఆదేశించారు.

పార్టీ వ్యవస్థ గురించి మాట్లాడుతూ, నాయకుల మధ్య సమన్వయం ఎంతో అవసరమని, అందరూ కలిసికట్టుగా పనిచేసినప్పుడే పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఎమ్మెల్యే అన్నారు . కార్యకర్తలే పార్టీకి వెన్నెముకని, వారి కష్టానికి తగిన గుర్తింపు ఎల్లప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా, ప్రత్యక్షంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో యువత, పార్టీ శ్రేణులు చురుకైన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో గార మండలంలోని వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన ప్రజా ప్రతినిధులు, మండల స్థాయి నాయకులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొని తమ మద్దతును ప్రకటించారు.

Leave a Reply