ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి….

ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి….
ఎమ్మెల్యేసాంబశివ రావుకు, ఎమ్మెల్సీ సత్యంకు చేనేత కార్మిక సంఘం వినతి
కరీమాబాద్, ఆంధ్రప్రభ : చేనేత పరిరక్షణ కార్మిక సమస్యలు పరిష్క రించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావుకు, శాసనమండలి సభ్యులు నెల్లి కంటి సత్యం కు తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు తాటిపాముల వెంకట్రాములు ప్రధాన కార్యదర్శి పాశికంటి లక్ష్మీనరసయ్య బుధవారం హైదరాబాద్ మగ్దూం భవన్ లో కలిసి వినతిపత్రాలు అందజేశారు.
రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల సమస్యల్ని పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని, శాసనసభ, శాసన మండలి సమావేశాలలో నేతన్నల కష్టాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ఒత్తిడి తెచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. చేనేత అభయ హస్తం కింద ప్రకటించిన పథకాలు అమలుకు నోచుకోలేదన్నారు. ప్రభుత్వ శాఖలకు అవసరమైన లివరి వస్త్రాలు, బెడ్ షీట్స్, కార్పెట్స్ వగైరా చేనేత కార్మికులు ఉత్పత్తి చేసిన వాటిని సహకార సంఘాల ద్వారా తీసుకోవాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని పక్కకు పెట్టి ప్రైవేట్ టెండర్ల ద్వారా తీసుకోవాలని ప్రయత్నించడం చేనేత కార్మికులకు మరణ శాసనం వంటిదన్నారు.
చేనేత ఉత్పత్తులను యధావిధిగా టెస్కోద్వారా కొనుగోలు చేసి వారికి ఉపాధి కల్పించాలన్నారు. చేనేత భరోసా కింద ప్రతి చేనేత కార్మికుడికి సంవత్సరానికి 18, 000, అనుబంధ కార్మికునికి 6000 చొప్పున రెండు విడతలుగా వారి ఖాతాలలో జమ చేస్తామన్న ప్రభుత్వం ఇప్పటివరకు ఒక పైసా ఎవరికి వేయలేదన్నారు. చేనేత బీమా ఏ వయసు వారికై నా చనిపోతే 5 లక్షల రూపాయలు ఇస్తామని అమలు జరపడం లేదని, చేనేత రుణమాఫీ క్షేత్రస్థాయిలో అందరికీ ఇంకా పూర్తిగా అందలేదని, చేనేత సహకార సంఘాల క్యాష్ క్రెడిట్ మాఫీ చేసి చేనేత కార్మికులకు పని కలిగించుటకు తిరిగి సహకార సంఘాలకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేయాలని, సహకార సంఘాలకు ఎన్నికలు జరిగి 13ఏండ్లు అవుతున్న ఎన్నికలు నిర్వహించనందున సంఘాలు నిర్వీర్యం అయిపోతున్నాయన్నారు.
వెంటనే సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించి టెస్కోకు పాలకమండలిని నియమించాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ లు, చేనేత సమస్యలు చట్టసభలలో ప్రస్తావించి ప్రభుత్వ పై ఒత్తిడి తెచ్చి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని సాంబశివరావు, సత్యం హామీ ఇచ్చారని వారు తెలిపారు.
