మహిళా భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది…

మహిళా భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది…
ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : మహిళా భద్రతకు ప్రభుత్వం మరియు పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అనంతపురం మహిళా డిఎస్పి మహబూబ్ బాషా పేర్కొన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్త్రీరక్ష పోర్టల్, శక్తి యాప్ సేవలు, మహిళా రక్షణ చట్టాలపై అవగాహన కార్యక్రమంలో భాగంగా ఉరవకొండ పట్టణంలోని దేవాంగ కళ్యాణమండపంలో మహిళలు, బాలికల భద్రతపై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు గుంతకల్లు డీఎస్పీ శ్రీనివాస్, అనంతపురం మహిళా డీఎస్పీ మహబూబ్ బాషా సమక్షంలో సీఐలు మహనంది, రాజు, వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీలు మాట్లాడుతూ మహిళా భద్రతకు ప్రభుత్వం, పోలీసుశాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. మహిళలు, బాలికలు ఎలాంటి భయాందోళనలకు గురి కాకుండా ధైర్యంగా, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తించినా లేదా వేధింపులకు గురిచేసినా వెంటనే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. మహిళల రక్షణ కోసం శక్తి యాప్ ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఈ యాప్‌లో బటన్ నొక్కగానే పోలీసులు తక్షణమే సంఘటన స్థలానికి చేరుకుని బాధితులను రక్షిస్తారని తెలిపారు. జిల్లా ఎస్పీ జగదీష్ నేతృత్వంలో మహిళలు, చిన్నారుల భద్రతకు పెద్దపీట వేశారన్నారు. క్రైం అగనెస్ట్ ఉమెన్ నియంత్రించడమే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు.
జిల్లా ఎస్పీ జగదీష్ మహిళల భద్రతను బలోపేతం చేయాలనే సంకల్పంతో, స్త్రీరక్ష పోర్టల్ ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ప్రతి ఇంటా మహిళలు, చిన్నారుల సమస్యలకు పరిష్కారం చూపడమే లక్ష్యంగా జిల్లా పోలీసులు పని చేస్తున్నామన్నారు.
పోలీసు స్టేషన్ వెళ్లకుండా ఇంటి నుండే మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం పొందడమే స్త్రీరక్ష పోర్టల్ ఉద్ధేశ్యమన్నారు. ఒకవైపు స్త్రీరక్ష పోర్టల్ మరోవైపు శక్తి యాప్ సేవలు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సిడిపివో డాక్టర్ శ్రీదేవి, ఎంపీడీవో రవి ప్రసాద్, ఎస్సైలు ఖాజా హుస్సేన్, మురారి, నాగ స్వామి తదితరులు పాల్గొన్నారు.
