ఎన్టీఆర్ జిల్లాలో ప్రత్యేక ఆధార్ సేవా శిబిరాలు

ఆగస్టు 11 నుంచి 14 వరకు, ఆగస్టు 17 నుంచి 29 వరకు నిర్వహణ
జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మశ

విజయవాడ, ఆంధ్రప్రభ: ప్రజలకు ఆధార్‌ సంబంధిత సేవలను సులభంగా, వేగవంతంగా, పారదర్శకంగా అందించేందుకు ఎన్టీఆర్‌ జిల్లాలో ప్రత్యేక ఆధార్‌ సేవా శిబిరాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి. లక్ష్మీశ తెలిపారు. ఎంపిక చేసిన స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డు కార్యాలయాలతో పాటు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఈ శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

ఈ ప్రత్యేక ఆధార్‌ శిబిరాలు ఆగస్టు 11 నుంచి 14 వరకు, ఆగస్టు 17 నుంచి 29 వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. ప్రజలు తమ ప్రాంతానికి సమీపంలో ఏర్పాటు చేసే శిబిరాలను సద్వినియోగం చేసుకుని ఆధార్‌కు సంబంధించిన అవసరమైన సేవలను పొందాలని సూచించారు.

శిబిరాల్లో కొత్త ఆధార్‌ నమోదు, ఆధార్‌లో పేరు సరిచేయడం లేదా నవీకరించడం, చిరునామా మార్పు, పుట్టిన తేదీ, మొబైల్‌ నంబర్‌, జీవవివరాల నవీకరణ వంటి సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. 5 నుంచి 15 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు తప్పనిసరి జీవవివరాల నవీకరణ చేయించాలని సూచించారు. 15 ఏళ్లు పైబడిన వారికి అవసరమైన జీవవివరాల నవీకరణతో పాటు ఇతర ఆధార్‌ సవరణలు, నవీకరణ సేవలు కూడా అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.

విద్యార్థులు ఆధార్‌ సంబంధిత సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోనే ప్రత్యేక శిబిరాలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పిల్లల ఆధార్‌ వివరాలను పరిశీలించుకుని, అవసరమైన నవీకరణలు ఉంటే ఈ శిబిరాలను వినియోగించుకోవాలని సూచించారు.

ఆధార్‌ సేవలను సకాలంలో, పారదర్శకంగా, సులభంగా అందించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. శిబిరాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక సదుపాయాలు, సిబ్బంది సమన్వయం, సేవల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

ఆధార్‌ నమోదు లేదా వివరాల నవీకరణ అవసరమున్న ప్రతి పౌరుడు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ ప్రత్యేక శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ కోరారు. ఆధార్‌ వివరాలను సక్రమంగా, తాజా సమాచారంతో ఉంచుకోవడం ద్వారా ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు, ఇతర అవసరమైన సేవలు పొందడంలో ఇబ్బందులు లేకుండా ఉంటాయని ఆయన పేర్కొన్నారు.