రాష్ట్రంలో విస్తరిస్తున్న టెలిమానస్ సేవలు

రాష్ట్రంలో విస్తరిస్తున్న టెలిమానస్ సేవలు

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో మానసిక ఆరోగ్య సేవల విస్తరణలో టెలిమానస్ హెల్ప్‌లైన్ కీలక పాత్ర పోషిస్తోంది. మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి ఉచితంగా, అందుబాటులో ఉండే ఈ సేవలు ప్రస్తుతం ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకున్నాయి. ఒత్తిడి, నిరాశ, ఆందోళన వంటి సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో, టెలిమానస్ సేవలు అనేక మందికి మానసిక బలాన్ని అందిస్తున్నాయి. విజయవాడ, విశాఖపట్నం కేంద్రాల నుంచి టోల్ ఫ్రీ నంబర్ 14416 ద్వారా ఈ సేవలు అందుతున్నాయి. ప్రారంభం నుంచి ఇప్పటివరకు మొత్తం 67,573 కాల్స్ నమోదయ్యాయి. 2024 జూన్ నాటికి 31 వేల కాల్స్ నమోదు కాగా, ఆ తరువాత కాలంలో కాల్స్ సంఖ్య వేగంగా పెరిగింది. ముఖ్యంగా 2024 జూలై నుంచి 2026 ఏప్రిల్ మధ్య కాలంలో గణనీయమైన వృద్ధి కనిపించడం, ప్రజల్లో అవగాహన పెరిగిందనే విషయాన్ని సూచిస్తోంది.

టెలిమానస్ వినియోగిస్తున్న వారిలో మహిళలు 52 శాతం ఉండటం విశేషం. కుటుంబ సమస్యలు, వ్యక్తిగత ఒత్తిడులు, ఉద్యోగ సంబంధిత సమస్యలు వంటి కారణాలతో మహిళలు ఎక్కువగా ఈ సేవలను ఆశ్రయిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. మానసిక ఆరోగ్యంపై మహిళల్లో అవగాహన పెరగడం కూడా దీనికి కారణంగా భావిస్తున్నారు.

మానసిక ఆరోగ్యానికి ‘టెలిమానస్’ భరోసా!

అధికారిక గణాంకాల ప్రకారం, కాలర్లలో 19.87 శాతం మంది డిప్రెషన్ సమస్యతో బాధపడుతున్నారు. ఉద్యోగ, పరీక్షల ఒత్తిడి (19.20 శాతం) రెండో స్థానంలో ఉంది. నిద్ర సమస్యలు (15.57 శాతం), ఆందోళన (11.7 శాతం) కూడా గణనీయంగా నమోదవుతున్నాయి. అదేవిధంగా మత్తు పదార్థాల వినియోగ సమస్యలు కూడా గణనీయంగా కనిపిస్తున్నాయి. ఈ గణాంకాలు సమాజంలో మానసిక ఆరోగ్య సమస్యలు ఎంతగా పెరుగుతున్నాయో తెలియజేస్తున్నాయి. జీవనశైలి మార్పులు, పోటీ వాతావరణం, ఆర్థిక ఒత్తిడి వంటి అంశాలు ఈ సమస్యలకు కారణాలుగా నిలుస్తున్నాయి.

నెలకు 3 వేల మందికి సేవలు
ప్రస్తుతం ప్రతి నెల సగటున 3,000 మంది టెలిమానస్ సేవలను వినియోగిస్తున్నారు. ఒక్కసారి మాత్రమే కాకుండా, పలువురు పునరావృతంగా కౌన్సెలింగ్ తీసుకుంటుండటం, ఈ సేవలపై పెరుగుతున్న నమ్మకాన్ని సూచిస్తోంది.

ఆత్మహత్య నివారణలో కీలక పాత్ర
టెలిమానస్ సేవలు ప్రాణాలను కాపాడడంలో కీలకంగా మారాయి. ఆత్మహత్య ఆలోచనలతో కాల్ చేసే వ్యక్తులకు తక్షణ సలహాలు, మానసిక మద్దతు అందించడం ద్వారా అనేక సందర్భాల్లో స్వీయహానిని నివారించగలిగామని అధికారులు తెలిపారు. సమయానికి అందిన సలహా ఒక జీవితాన్ని మార్చగలదని నిపుణులు పేర్కొంటున్నారు.

నిపుణుల పర్యవేక్షణలో సేవలు
సైకియాట్రిస్టుల పర్యవేక్షణలో శిక్షణ పొందిన కౌన్సిలర్లు ఫోన్, వీడియో ద్వారా సేవలు అందిస్తున్నారు. ప్రతి కాల్‌కు 10 నుంచి 20 నిమిషాల సమయం కేటాయిస్తున్నారు. అవసరాన్ని బట్టి పునరావృత కౌన్సెలింగ్ కూడా అందిస్తున్నారు.

కాలర్ల గోప్యతను కాపాడడం టెలిమానస్ సేవల ప్రధాన లక్షణం. కాల్ చేసే వ్యక్తుల వివరాలు కౌన్సిలర్లకు తెలియవు. దీంతో ప్రజలు తమ సమస్యలను భయపడకుండా స్వేచ్ఛగా చెప్పగలుగుతున్నారు. స్థానిక భాషలో సేవలు అందిస్తున్నారు. కాల్ వచ్చిన వెంటనే అందుబాటులో ఉన్న కేంద్రానికి స్వయంచాలకంగా మార్గం చూపబడుతుంది. స్థానిక భాషలో కౌన్సెలింగ్ అందించడం వల్ల గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా ఈ సేవలను వినియోగిస్తున్నారు.

ఆరోగ్యశాఖ మంత్రి వై సత్యకుమార్ టెలిమానస్ కేంద్రాల పనితీరును సమీక్షించి, ప్రతి కాల్‌ను అత్యంత ప్రాముఖ్యంగా తీసుకోవాలని అధికారులకు సూచించారు. బాధితులకు తక్షణ సహాయం అందించాలన్నారు. దేశవ్యాప్తంగా టెలిమానస్ సేవలు కొనసాగుతున్నాయి. దక్షిణ రాష్ట్రాల కోసం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ ప్రధాన సంస్థగా వ్యవహరిస్తోంది.

భారతదేశంలో సుమారు 197 మిలియన్ల మంది మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని అంచనా. ఇది ఒక పెద్ద సవాలుగా మారుతోంది. మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచడం అత్యవసరం. మానసిక సమస్యలను దాచుకోవడం కాకుండా, సమయానికి సహాయం తీసుకోవడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా బాధితులకు మద్దతుగా ఉండాలని చెబుతున్నారు.

Leave a Reply