ధాన్యాన్ని దోచుకునే వారిని వదిలిపెట్టం..

  • సీఎంఆర్ బియ్యం అక్రమ దారి మళ్లింపు
  • నిందితుడిపై పీడీ యాక్ట్ అమలు
  • చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం
  • పోలీస్ కమిష నర్ అంబర్ కిషోర్ ఝా

సుల్తానాబాద్, ఆంధ్రప్రభ: ప్రభుత్వ ధాన్యాన్ని అక్రమంగా దారి మళ్లించే వారిని వదిలిపెట్టేది లేదని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా స్పష్టం చేశారు. సీఎంఆర్ బియ్యం అక్రమ దారి మళ్లింపు వ్యవహారంలో సోమవారం కరీంనగర్ జిల్లా కట్టరాంపూర్కు చెందిన బండారి మారుతి (43)పై పీడీ యాక్ట్ అమలు చేసిన సందర్భంగా సీపీ ఉత్తర్వుల మేరకు సుల్తానాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి. రంజిత్ రావు, సుల్తానాబాద్ సన్స్పెక్టర్ చంద్రకుమార్ కరీంనగర్ జిల్లా జైలుకు వెళ్లి, జైలర్ సమక్షంలో నిందితుడికి పీడీ యాక్ట్ ఉత్తర్వులను అందజేసిన అనంతరం చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు.

ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ 2023-24 రబీ, ఖరీఫ్ సీజన్లలో తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థతో కస్టమ్ మిల్లింగ్ ఒప్పందం కుదుర్చుకున్న నిందితుడు మొత్తం 11,213.040 మెట్రిక్ టన్నుల వరిని స్వీకరించి, ప్రభుత్వానికి అప్పగించాల్సిన 7,624.867 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యాన్ని ప్రభుత్వానికి అందజేయకుండా అక్రమంగా ఇతర రైస్ మిల్లులకు విక్రయించినట్లు తేలిందన్నారు. ప్రభుత్వానికి రూ.27 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు దర్యాప్తులో నిర్ధారణ కావడంతోపాటు నిందితుడిపై 2024 నుంచి 2026 వరకు పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో నాలుగు క్రిమినల్ కేసులు నమోదయ్యాయని వివరించారు.

సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ కేసులో అరెస్టై బెయిల్పై విడుదలైన అనంతరం కూడా అదే తరహా నేరాలకు పాల్పడినట్లు గుర్తించామన్నారు. ప్రస్తుతం మరో కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న అతను తిరిగి విడుదలైతే మళ్లీ ప్రజా పంపిణీ వ్యవస్థకు భంగం కలిగించే అవకాశం ఉన్నందున ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పీడీ యాక్ట్ అమలు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వ ధాన్యం అనేది పేదల హక్కు అని, ధాన్యాన్ని అక్రమంగా దోచుకుని బ్లాక్ మార్కెట్కు తరలించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉ ఎక్షించమన్నారు. ప్రజల ఆహార భద్రతకు భంగం కలిగించే వారిపై సాధారణ క్రిమినల్ కేసులతోనే ఆగిపోము. అవసరమైతే పీడీ యాక్ట్ తో పాటు చట్టంలో ఉన్న అత్యంత కఠిన నిబంధనలను అమలు చేస్తామన్నారు.

సీఎంఆర్ బియ్యం అక్రమ దారిమళ్లింపులో పాల్గొన్న ప్రతి వ్యక్తిని, నిర్వాహకుడిని, సహకరించిన వారిని, లబ్ధి పొందిన వారిని గుర్తించి చట్టం ముందు నిలబెడతామన్నారు. కమిషనరేట్ పరిధిలో ప్రభుత్వ ధాన్యాన్ని అక్రమంగా దారిమళ్లించే వారిపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, అక్రమాలకు పాల్పడే వారు వెంటనే తమ కార్యకలాపాలను విరమించుకోవాలన్నారు. లేకపోతే పీడీ యాక్ట్ తో పాటు కఠినమైన చట్టపరమైన నిర్బంధ చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ ధాన్యాన్ని అక్రమంగా కొ నుగోలు చేయడం, నిల్వ చేయడం, రవాణా చేయడం, విక్రయించడంలాంటి నేరాలకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సహకరించే వారిపైనా సమానంగా కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ స్పష్టం చేశారు. పీడీ యాక్ట్ అమలుకు కృషి చేసిన పెద్దపల్లి ఏసీపీ కృష్ణ, సుల్తానాబాద్ సీఐ పి.రంజిత్ రావు, ఎస్సై చంద్రకుమార్ లను సీపీ అభినందించారు.