HYD | చరిత్రలో నిలిచిపోనున్న వరంగల్ సభ… తలసాని

హైదరాబాద్ : ఈనెల 27వ తేదీన వరంగల్ జిల్లాలో నిర్వహించే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ చరిత్రలో నిలిచిపోతదని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. సోమవారం వెస్ట్ మారేడ్ పల్లిలోని తన కార్యాలయంలో సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో సభకు సంబంధించిన అంశాలపై సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రతి బస్తీ, ప్రతి కాలనీ నుండి పెద్ద సంఖ్యలో సభకు తరలి రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమం 1969 లోనే పుట్టినప్పటికీ వివిధ కారణాలతో అవి మధ్యలోనే ముగిశాయని తెలిపారు. తెలంగాణ ప్రాంతానికి, ప్రజలకు అన్ని విధాలుగా ఎంతో అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. స్వరాష్ట్ర సాధనతోనే న్యాయం జరుగుతుందని గుర్తించిన ఉద్యమ నాయకుడు కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ పుట్టిందన్నారు.

అనేక పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని గుర్తు చేశారు. రాష్ట్రం కోసం కేసీఆర్ ప్రాణత్యాగానికి సైతం సిద్ధపడిన విషయాన్ని వివరించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంను అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని చెప్పారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే రాష్ట్ర అభివృద్ధి మళ్ళీ మొదటికొచ్చిందని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో రైతులు, వ్యాపారులు, ఉద్యోగులు అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఈ రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ శ్రీ రామరక్ష అన్నారు. తిరిగి కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. పార్టీ పుట్టి 25వసంతాలు పూర్తవుతున్న నేపథ్యంలో ఈనెల 27వ తేదీన అన్ని డివిజన్లలో పార్టీ జెండాలను ఎగురవేసి పార్టీ పండుగను ఘనంగా నిర్వహించాలని చెప్పారు.

వరంగల్ జిల్లాలో నిర్వహించే రజతోత్సవ సభకు స్వచ్చందంగా తరలి వచ్చేందుకు అన్నివర్గాల ప్రజలు సిద్ధమవుతున్నారని తెలిపారు. ఈ సమావేశంలో బేగంపేట కార్పొరేటర్ టి.మహేశ్వరి, అమీర్ పేట మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, డివిజన్ అధ్యక్షులు ఆకుల హరికృష్ణ, కొలన్ బాల్ రెడ్డి, అత్తిలి శ్రీనివాస్ గౌడ్, హన్మంతరావు, వెంకటేషన్ రాజు, శ్రీనివాస్ గౌడ్, పద్మారావు నగర్ ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్, నాయకులు అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, తలసాని స్కైలాబ్ యాదవ్, నాయకులు నాగులు, కిషోర్, శ్రీహరి, నరేందర్, అశోక్ యాదవ్, ఏసూరి మహేష్, లక్ష్మీపతి, కరుణాకర్ రెడ్డి, ఖలీల్, సురేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply