TG | అధికారంలోకి వ‌చ్చినా ప్రిపేర్ కాలేదా..? అసెంబ్లీ వాయిదాపై హ‌రీశ్ రావు ఆగ్ర‌హం


రెండు నిమిషాల‌కే స‌భ వాయిదానా
ప్ర‌తిప‌క్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా మార‌ని తీరు..
కాంగ్రెస్ తీరును ప్ర‌శ్నించిన బీఆర్ఎస్ నేత

హైద‌రాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ : కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిద్ధంగా లేదని, ఇప్పుడు అధికారంలోకి వచ్చినా ఇంకా సిద్ధం కాలేకపోతోందని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. ఈరోజు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడింది. మంత్రి మండలి సమావేశం కొనసాగుతుండటంతో సభను వాయిదా వేయాలని మంత్రి శ్రీధర్ బాబు సభాపతిని కోరారు. మినిట్స్ తయారీకి సమయం పడుతుందని ఆయన తెలిపారు. దీంతో స్పీకర్ ప్రసాద్ కుమార్ సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు. సభను వాయిదా వేయడంపై హరీశ్ రావు ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. “అసెంబ్లీ ప్రారంభమైన రెండు నిమిషాలకే వాయిదా వేయడమేమిటి? కేబినెట్ సమావేశం ఇంకా కొనసాగుతోందని, సబ్జెక్ట్ నోట్స్ సిద్ధం చేయలేదని సభను వాయిదా వేయాలని మంత్రి శ్రీధర్ బాబు కోరడం హాస్యాస్పదం” అని ఆయన పేర్కొన్నారు. “నాడు ప్రతిపక్షంలో ఉన్నా ప్రిపేర్ కాలేదు, నేడు పాలక పక్షంలో ఉన్నా ప్రిపేర్ కాలేదు, ఇంకెప్పుడు ప్రిపేర్ అవుతారు?” అని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ఆయన ప్రశ్నించారు.

ఒక్క నిమిషంలోనే వాయిదా వేయడమేమిటి? : తలసాని


సభను ఒకే నిమిషంలో వాయిదా వేయడం ప్రభుత్వం యొక్క బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సభను వాయిదా వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సమావేశాన్ని వాయిదా వేసి శాసన సభ నిబంధనలను తుంగలో తొక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి డిక్లరేషన్ యథాతథంగా అమలు చేయడం కోసం తెలంగాణ సమాజం ఎదురు చూస్తోందన్నారు. మంత్రి శ్రీధర్ బాబు అడిగిన వెంటనే స్పీకర్ సభను వాయిదా వేయడాన్ని ఖండిస్తున్నామని ఆయన అన్నారు. ప్రాధాన్యత గల అంశాలపై నాలుగు రోజుల పాటు చర్చ పెట్టకుండా ఒక్కరోజులోనే ముగించాలనుకోవడం సరికాదన్నారు. ఇలాంటి బాధ్యతారాహిత్య, కుట్రపూరిత ప్రభుత్వాన్ని తాను గతంలో చూడలేదన్నారు. కాంగ్రెస్ నిర్వహించిన బీసీ కులగణన సర్వేలో తమకు అనుమానాలు ఉన్నాయని ఆయన అన్నారు. అనుమానాలను నివృత్తి చేసేందుకు నాలుగు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కులగణన తప్పుగా ఉందని చెబుతున్నామని, సరిగ్గానే చేశామని నిరూపించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. బీసీలకు అన్యాయం జరిగితే అతిపెద్ద ఉద్యమం వస్తుందని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *