ఎస్‌ఐఆర్ సర్వేపై ఓటర్లు ఆందోళన చెందొద్దు
- సర్పంచ్ దీకొండ విజయ్‌కుమార్
కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలంలోని పెద్దూరు గ్రామంలో నిర్వహిస్తున్న ఎస్‌ఐఆర్ (Special Intensive Revision) ఓటరు జాబితా ప్రత్యేక సర్వేను శుక్రవారం గ్రామ సర్పంచ్ దీకొండ విజయ్‌కుమార్, ఉప సర్పంచ్ పిట్టల రాజన్న, బీఎల్‌వో నేరెళ్ల గంగమణి, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, బీఎల్‌ఏలు కలిసి పరిశీలించి సమీక్షించారు.
ఈ సందర్భంగా ఎస్‌ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించారు. మ్యాపింగ్ ఫారమ్‌ను ఎలా నింపాలి, ప్రతి కుటుంబ సభ్యుల వివరాలు, ఓటరు సమాచారం తదితర అంశాలను సరైన విధంగా నమోదు చేసే పద్ధతిని వివరించారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ దీకొండ విజయ్‌కుమార్ మాట్లాడుతూ, గ్రామంలోని ప్రతి అర్హత కలిగిన ఓటరు తప్పనిసరిగా ఎస్‌ఐఆర్ ఓటరు జాబితా పరిశీలన, మ్యాపింగ్ ప్రక్రియలో పాల్గొని తమ వివరాలను సరిచూసుకోవాలని కోరారు. ఈ ప్రక్రియపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వివరాల సవరణకు ఇంకా నెల రోజుల సమయం ఉందని తెలిపారు.
బీఎల్‌వోలు సూచించిన విధంగా ఫారమ్‌లను పూర్తిగా నింపి, సరైన వివరాలు నమోదు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు జుబేర్ ఖాన్, రేషన్ డీలర్ షర్ఫుద్దీన్, కాంగ్రెస్ పార్టీ బీఎల్‌ఏలు దుర్గ భవాని, సయ్యద్ వసీ, బీఆర్ఎస్ పార్టీ బీఎల్‌ఏ ముబారక్, బీఆర్ఎస్ సోషల్ మీడియా కడెం మండల అధ్యక్షుడు ఎండీ హసీబ్, స్థానిక నాయకులు నదీమ్, సోహెల్, కాలిక్, జహీర్, రిజ్వాన్ తదితరులు పాల్గొన్నారు.
