vijayawada |ఉత్తర్వులు జారీ చేసిన ఈవో శీనా నాయక్‌

  • నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించిన దేవస్థానం

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ: విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి మూలవిరాట్‌ను చిత్రీకరించి తన వాట్సాప్ స్టేటస్‌లో ఉంచిన ఆలయ అర్చకుడు ఈఎల్ నరసింహారావును సస్పెండ్ చేస్తూ దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

దేవస్థాన నిబంధనల ప్రకారం… అంతరాలయంలోని అమ్మవారి మూలవిరాట్‌ను ఫొటోలు లేదా వీడియోల రూపంలో చిత్రీకరించడం పూర్తిగా నిషేధం. అయినప్పటికీ అర్చకుడు మూలవిరాట్ ఫొటోను తీసి తన వ్యక్తిగత వాట్సాప్ స్టేటస్‌గా ఉంచి, ఆలయ పవిత్రతకు భంగం కలిగించేలా వ్యవహరించిన విషయం దేవస్థానం అధికారుల దృష్టికి వచ్చింది.

విషయాన్ని అత్యంత తీవ్రంగా పరిగణించిన కార్యనిర్వహణాధికారి శీనా నాయక్ వెంటనే విచారణకు ఆదేశించి, ప్రాథమికంగా నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు నిర్ధారణ కావడంతో వి.ఎల్. నరసింహారావును తక్షణ ప్రభావంతో సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దేవస్థాన ఆగమ, భద్రతా నియమాలను కచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత అర్చకులపైనే ఉంటుందని, వాటిని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఈఓ శీనా నాయక్ స్పష్టం చేశారు.