Vijayawada పనిముట్లు కాదు.. పుస్తకాలే పిల్లల చేతుల్లో ఉండాలి

Vijayawada పనిముట్లు కాదు.. పుస్తకాలే పిల్లల చేతుల్లో ఉండాలి

  • బాల కార్మిక వ్యవస్థపై కలెక్టర్ లక్ష్మీశ పిలుపు

విజయవాడ (Vijayawada), ఆంధ్రప్రభ:

బాల్యం ప్రతి చిన్నారి జీవితంలో అత్యంత విలువైన దశ అని, ఆ వయస్సులో విద్య, ఆటపాటలు, ఆనందంతో గడపాల్సిన చిన్నారులు బాల కార్మిక వ్యవస్థ కారణంగా తమ హక్కులను కోల్పోతున్నారని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అన్నారు. పుస్తకాలు పట్టాల్సిన వయస్సులో పనిముట్లు పట్టుకుని పనిచేయడం వల్ల వారి భవిష్యత్తు దెబ్బతింటుందని పేర్కొన్నారు.

ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కార్మిక శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్, వాసవ్య మహిళామండలి సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం భవానిపురంలోని పున్నమిఘాట్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై అవగాహన పోస్టర్లను విడుదల చేసి ర్యాలీని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాల్యంలో చిన్నారులు పుస్తకాలను పట్టాలే గానీ పనిముట్లను కాదనే విషయాన్ని ప్రతి కుటుంబం గుర్తుంచుకోవాలని అన్నారు. చిన్న వయస్సులోనే పనుల్లో నిమగ్నమై బాల్యాన్ని కోల్పోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు.

పిల్లలు పనుల్లో కాకుండా పాఠశాలల్లో ఉండి విద్యాభ్యాసం చేయాలని, ఆరోగ్యంగా ఎదగాలని, యోగా వంటి ఆరోగ్యకరమైన అలవాట్లు అలవరచుకునేలా తల్లిదండ్రులు కృషి చేయాలని సూచించారు. విద్య ద్వారానే పిల్లల్లోని ప్రతిభ వెలుగులోకి వస్తుందని, ఆ ప్రతిభతోనే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు.

బాల కార్మిక వ్యవస్థకు ముగింపు పలికితేనే భవిష్యత్తుకు బంగారు బాట ఏర్పడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. బాల కార్మిక వ్యవస్థను అరికట్టడం ప్రతి పౌరుడి సామాజిక బాధ్యతగా భావించాలని సూచించారు. ప్రతి చిన్నారికి విద్య హక్కు అందేలా కృషి చేస్తేనే ఉత్తమ సమాజ నిర్మాణానికి బాటలు పడతాయని అన్నారు.

పిల్లలను పనిలో కాకుండా పాఠశాలలో చూడాలనే సంకల్పంతో ముందుకు సాగాలని, బాల్యాన్ని కాపాడుతూ బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు.

సమాజంలో బాధ్యతాయుతంగా వ్యవహరించి, పాఠశాలకు వెళ్లకుండా పనులు చేస్తున్న చిన్నారులను గుర్తించి సమీప పాఠశాలల్లో చేర్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి బాలుడు, బాలిక విద్యను అభ్యసిస్తూ ఆరోగ్యంగా ఎదిగితేనే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని చెప్పారు.

భవిష్యత్ తరాలను సుస్థిరంగా తీర్చిదిద్దాలంటే పిల్లల హక్కులను పరిరక్షించడం అత్యంత అవసరమన్నారు. ప్రతి చిన్నారి తన బాల్యాన్ని ఆనందంగా గడిపేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు సమాజంపైనా ఉందని పేర్కొన్నారు.

బాల కార్మికులను గుర్తించినట్లయితే వెంటనే సంబంధిత శాఖల అధికారులకు సమాచారం అందించి, చిన్నారులను విద్యా మార్గంలో నడిపించేందుకు సహకరించాలని కోరారు. జిల్లాను బాల కార్మిక రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

జిల్లాలో బాలల హక్కుల పరిరక్షణ, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందని, ప్రతి చిన్నారి సురక్షితమైన, విద్యావంతమైన భవిష్యత్తు కోసం నిరంతరం కృషి చేస్తోందని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు.

కార్యక్రమంలో కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ జి. ధనలక్ష్మి, ఐసీడీఎస్ పీడీ రుక్సానా సుల్తానా బేగం, ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ జిల్లా కో-ఆర్డినేటర్ ఆరవ రమేష్, నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ చంద్రశేఖర్, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ శ్రీనివాసరావు, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ ఎం. మధు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply