harish rao | రేవంత్ వైఫ‌ల్యంతోనే షాబాద్ లో హత్యలు..

చట్టం అందరికీ సమానమేనా?

harish rao | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. పోక్సో, ఆరు హత్యల కేసు నిందితుడు రాజ్‌కుమార్ వ్యవహారంలో ప్రభుత్వం, పోలీసుల తీరుపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు.

రేవంత్‌రెడ్డికి సన్నిహితుడిగా పేర్కొన్న ఓ మార్కెట్ కమిటీ చైర్మన్ రూ.20 లక్షలు లంచం తీసుకుని రాజ్‌కుమార్ అరెస్టు కాకుండా కాపాడాడని హరీశ్‌రావు ఆరోపించారు. పోలీసులు నిందితుడిని వెంటనే అరెస్టు చేయకుండా 45 రోజుల సమయం ఇవ్వడం వల్ల అతడు కోర్టు నుంచి బెయిల్ పొందడంతో పాటు అనంతరం ఆరుగురి హత్యలకు పాల్పడ్డాడని విమర్శించారు.

చిన్న చిన్న విమర్శలు చేసిన వారిపై వెంటనే కేసులు నమోదు చేస్తున్నారని, కానీ తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్‌కుమార్ విషయంలో పోలీసులు అదే వేగం చూపలేదన్నారు. చట్టం అందరికీ సమానంగా అమలుకావాలని డిమాండ్ చేశారు.

మూసీ సుందరీకరణ, ఫ్యూచర్ సిటీ వంటి ప్రాజెక్టులకు భారీగా నిధులు వెచ్చిస్తున్న ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి మాత్రం నిధులు లేవని చెబుతోందని హరీశ్‌రావు విమర్శించారు. ఆ నిధులతో పాఠశాలలు, కళాశాలలు నిర్మించవచ్చని అభిప్రాయపడ్డారు.

పక్క రాష్ట్రాల ఎన్నికల సమయంలో ప్రకటనలు, రైతుబంధు సభల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల పేరుతో సంక్షేమ కార్యక్రమాలను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసినట్లు చెబుతున్న వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, అలాంటి వ్యాఖ్యలపై కూడా పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. హింసను ప్రేరేపించేలా ఎవరైనా మాట్లాడితే వారిపై కేసులు నమోదు చేయాల్సిందేనని, ఈ విషయంలో పోలీసులు పక్షపాతం చూపకూడదన్నారు.