సరికొత్తగా ఓల్డ్ జిజిహెచ్…
జూలై 9న నడ్డా చేతుల మీదుగా క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభం…
ఆకస్మిక తనిఖీ నిర్వహించిన ఎంపీ కేశినేని చిన్ని
పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలి
రోగుల సహాయకుల కోసం ఎంపీ నిధులతో రెండు వెయిటింగ్ హాళ్ల నిర్మాణం..
అత్యాధునిక వైద్య సేవలతో వేలాది మందికి మెరుగైన చికిత్స అందుబాటులోకి..
పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యమే లక్ష్యం…
ఎంపీ కేశినేని శివనాథ్
విజయవాడ, ఆంధ్రప్రభ : విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న అత్యాధునిక క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ నెల 9న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జె.పి. నడ్డా చేతుల మీదుగా భవనాలను ప్రారంభించనున్నట్లు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) వెల్లడించారు. ప్రారంభోత్సవానికి ముందు గురువారం ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించిన ఆయన నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యం…
ప్రజారోగ్యానికి అత్యున్నత ప్రాధాన్యం ఇస్తూ అత్యవసర వైద్య సేవలను మరింత బలోపేతం చేసే దిశగా విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్మిస్తున్న క్రిటికల్ కేర్ బ్లాక్ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ (చిన్ని) గురువారం ఆసుపత్రిలో ఆకస్మికంగా పర్యటించి నిర్మాణ పనుల పురోగతిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఇంజినీర్లు, ఆసుపత్రి అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో కలిసి ప్రతి అంతస్తు, వార్డు, ఐసీయూ విభాగాలను పరిశీలించిన ఎంపీ, నిర్మాణంలో ఎలాంటి రాజీ లేకుండా నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. ప్రజల ప్రాణాలకు సంబంధించిన ప్రాజెక్టు కావడంతో పనులను నిర్ణీత గడువులో పూర్తి చేసి అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉంచాలని సూచించారు.
ఈ సందర్భంగా ఎంపీ కేసినేని చిన్ని మాట్లాడుతూ జూలై 9న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జె.పి. నడ్డాతో కలిసి క్రిటికల్ కేర్ బ్లాక్‌ను ప్రజలకు అంకితం చేయనున్నట్లు వెల్లడించారు. ఈ భవనం అందుబాటులోకి రావడంతో విజయవాడతో పాటు ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు తదితర పరిసర జిల్లాల నుంచి వచ్చే అత్యవసర రోగులకు ఆధునిక వైద్య సేవలు మరింత సులభంగా అందనున్నాయని తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు, వారి కుటుంబ సభ్యులతో ఎంపీ చిన్ని మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రోగుల సహాయకుల కోసం ప్రత్యేక వెయిటింగ్ హాళ్లు అవసరమని ఆసుపత్రి సూపరింటెండెంట్ విజ్ఞప్తి చేయగా, వెంటనే స్పందించిన ఎంపీ తన ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి రెండు అత్యాధునిక వెయిటింగ్ హాళ్ల నిర్మాణానికి ఆమోదం తెలుపుతూ హామీ ఇచ్చారు.
ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి పేద రోగికి కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఎంపీ పేర్కొన్నారు. వైద్యులు, సిబ్బంది సేవాభావంతో పనిచేస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడే ఈ క్రిటికల్ కేర్ బ్లాక్ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిని ఆధునిక వైద్య సేవల కేంద్రంగా నిలబెడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
