Vadderas Quarry Lease Quota | వడ్డెరలకు మైన్స్ క్వారీ లీజుల్లో 33 శాతం రిజర్వేషన్
Vadderas Quarry Lease Quota | వడ్డెరలకు మైన్స్ క్వారీ లీజుల్లో 33 శాతం రిజర్వేషన్
Vadderas Quarry Lease Quota | వడ్డెరలకు ప్రభుత్వం వరం
ఫలించిన నిరీక్షణ.. నెరవేరిన హామీ
స్థానిక సొసైటీలకే తొలి ప్రాధాన్యత
50 శాతం రాయితీలతో అదనపు ప్రయోజనం
అక్రమ తవ్వకాలకు చెక్
ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం: లోకేష్
Vadderas Quarry Lease Quota | అమరావతి, ఆంధ్రప్రభ: క్వారీ వృత్తిలో ఉన్న వడ్డెర కులస్తులకు ప్రభుత్వం వరం ప్రకటించింది. రిజిస్టర్డ్ వడ్డెర సహకార సంఘాలకు క్వారీ లీజుల మంజూరులో 33 శాతం ప్రాధాన్యత కల్పిస్తూ పరిశ్రమలు, వాణిజ్య శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు ఏపీ మైనర్ మినరల్ కన్సెషన్ రూల్స్-1966కు సవరణలు చేస్తూ ప్రభుత్వం జీవో126 విడుదల చేసింది.
ఫలించిన నిరీక్షణ..
రోడ్ మెటల్, బిల్డింగ్ స్టోన్, స్లేట్, కెర్బ్స్ క్యూబ్స్ తవ్వకాల్లో వడ్డెరలు తరతరాలుగా నిమగ్నమైనప్పటికీ, అధికారిక క్వారీ లీజులు మాత్రం దక్కడం లేదు. 2022లో ప్రవేశపెట్టిన వేలం విధానం వల్ల వడ్డెర సొసైటీలకు ప్రాధాన్యత తగ్గింది. దీన్ని పునః సమీక్షించాలని వడ్డెరలు పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశారు.
యువగళం పాదయాత్రలో లోకేష్ దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లగా, సానుకూలంగా స్పందించిన ఆయన అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. నాటి హామీ మేరకు తాజాగా జీవో విడుదలైంది.
‘సామాజిక న్యాయం, సాంప్రదాయ వృత్తి హక్కులు, సమ్మిళిత ఆర్థికాభివృద్ధి’ కోణంలో కూటమి ప్రభుత్వం వడ్డెరలకు 33 శాతం వాటా కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
బిల్డింగ్ స్టోన్, రఫ్ స్టోన్ బౌల్డర్స్, రోడ్ మెటల్ బ్యాలస్ట్, మొరంగ్రావెల్, ఆర్డినరీ ఎర్త్, కెర్బ్స్ క్యూబ్స్ కోసం వాడే డైమెన్షనల్ స్టోన్, స్లేట్ ఖనిజాలకు ఈ ప్రాధాన్యత వర్తిస్తుంది. వీటిని కొత్తగా వర్గీకరించారు. ప్రతి ‘ఎవాల్యుయేషన్ స్లాట్’లో మంజూరు చేసే మొత్తం విస్తీర్ణంలో 33 శాతం విస్తీర్ణాన్ని వడ్డెర సొసైటీలకు కేటాయిస్తారు.
స్థానికులకే ప్రాధాన్యత…
ఒకే భూమికి పలు సొసైటీలు పోటీపడితే స్థానిక సొసైటీకి ప్రాధాన్యత ఇస్తారు. అదే గ్రామంలో రిజిస్టరైన సొసైటీకి మొదటి ప్రాధాన్యం, తర్వాత అదే మండలం, ఆ తర్వాత ముందుగా దరఖాస్తు చేసిన సొసైటీకి అవకాశం ఇస్తారు. ఒక్కో రిజిస్టర్డ్ వడ్డెర సొసైటీకి గరిష్టంగా 12 హెక్టార్ల వరకు లీజు లభిస్తుంది.
50 శాతం రాయితీలతో అదనపు ప్రయోజనం
ఇలా మంజూరైన లీజులపై సీనరేజీ ఫీజులో 50 శాతం రాయితీ లభిస్తుంది. అలాగే ప్రీమియం మొత్తంలోనూ 50 శాతం రాయితీ ఉంటుంది. వడ్డెర సొసైటీకి ప్రాధాన్యత కింద ఇచ్చిన లీజును వేరే సొసైటీకి తప్ప ఇతరులకు బదిలీ చేయడం, సబ్-లీజుకు ఇవ్వడం కుదరదు. ఉల్లంఘిస్తే లీజు రద్దవుతుంది. క్యాలెండర్ ఏడాదిని 45 రోజుల చొప్పున 8 ‘ఎవాల్యుయేషన్ స్లాట్లు’గా విభజిస్తారు. ప్రతి స్లాట్ ముగిసిన తర్వాత వచ్చిన దరఖాస్తులన్నింటినీ ఒకేసారి పరిశీలించి, వడ్డెర సొసైటీలకు 33 శాతం కోటా ప్రకారం కేటాయిస్తారు.
వడ్డెర సొసైటీల నుంచి దరఖాస్తులు రాకపోతే 100 లీజులను ‘ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్’ పద్ధతిలో ఇతరులకు ఇస్తారు.
ప్రభుత్వం ప్రత్యేకంగా నోటిఫై చేసిన ‘వడ్డెర క్వారీ పూల్’ కింద 100 హెక్టార్ల భూమిని పంపిణీ చేసిన తర్వాత ఈ 33 శాతం ప్రాధాన్యత విధానం అమల్లోకి వస్తుంది.
అక్రమ తవ్వకాలకు చెక్
ఈ సవరణలతో వడ్డెర కులస్తులకు సొంత కాళ్లపై నిలబడే అవకాశం దక్కుతుందని, అక్రమ తవ్వకాలకు చెక్ పడుతుందని గనుల శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం: మంత్రి లోకేష్
క్వారీ లీజు కేటాయింపుల్లో వడ్డెర కులస్తులకు 33 శాతం వాటా కేటాయింపు ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం అని మంత్రి లోకేష్ కొనియాడారు.
యువగళం పాదయాత్రలో ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా చూసి, ఆనాడు తాను ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు.
కులవృత్తిని కొనసాగించేందుకు క్వారీలు కేటాయించాలని పాదయాత్ర సమయంలో వడ్డెర సోదరులు విన్నవించారని, ఆనాడు తాను వారికి ఇచ్చిన హామీ మేరకు 33 శాతం వాటాపై ప్రభుత్వం జీవో జారీ చేసిందన్నారు.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా చంద్రబాబు నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని లోకేష్ పేర్కొన్నారు.
