Assembly | దావోస్ ఒప్పందాలతో వేల ఉద్యోగాలు

Assembly | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: దావోస్ పర్యటనల ద్వారా రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులపై అసెంబ్లీలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సమగ్ర వివరణ ఇచ్చారు. పెట్టుబడులు, ఉద్యోగాల సృష్టిపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు.

మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ… దావోస్ సమావేశాల ద్వారా రాష్ట్రానికి మొత్తం రూ.2.19 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మొత్తం 44 ఎంవోయూలు కుదిరాయని, వాటి ద్వారా 68,150 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు కలిగాయని వెల్లడించారు.

2024 దావోస్ సదస్సులో 18 ఎంవోయూలు కుదిరి రూ.40,232 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు, 2025 దావోస్ సదస్సులో 26 ఎంవోయూల ద్వారా రూ.1,78,950 కోట్ల పెట్టుబడులు సాధించినట్లు పేర్కొన్నారు.

అదనంగా, రూ.81,800 కోట్ల పెట్టుబడులతో 6 కంపెనీలకు భూముల కేటాయింపు జరిగిందని, దీని ద్వారా ప్రభుత్వానికి రూ.1,540 కోట్ల ఆదాయం లభించిందని తెలిపారు. మరో 3 సంస్థలకు రూ.30 వేల కోట్ల పెట్టుబడుల కోసం భూములను గుర్తించినట్లు చెప్పారు.

నిజామాబాద్‌లో నిర్మించిన ఐటీ టవర్‌పై కూడా మంత్రి వివరాలు వెల్లడించారు. 681 సీట్ల సామర్థ్యంతో నిర్మించిన ఈ టవర్‌లో ప్రస్తుతం 11 కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, అందులో 276 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు. పెట్టుబడుల ఒప్పందాలపై పారదర్శకత కోసం ప్రభుత్వం త్వరలో శ్వేతపత్రం విడుదల చేయనున్నట్లు మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు.