Umamaheswara | క్షేత్రంలో 15నుంచి బ్రహ్మోత్సవాలు

Umamaheswara | క్షేత్రంలో 15నుంచి బ్రహ్మోత్సవాలు

  • 14న అయ్యప్ప స్వామి హోమం
  • 16న భోగ మహేశ్వరంలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం ఉత్సవం

Umamaheswara | అచ్చంపేట, ఆంధ్రప్రభ : నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలోని ద్వాదశ జ్యోతిర్లింగ శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయానికి ఉత్తర ద్వారంగా ఉన్న శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 15 నుంచి 22 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ బీరం మాధవరెడ్డి, కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు తెలిపారు.

Umamaheswara

బ్రహ్మోత్సవాల్లో భాగంగా 16న‌ శుక్రవారం ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటలకు పార్వతీ పరమేశ్వరుల దివ్య కళ్యాణ మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో జరగనుంది. ఈ ఉత్సవాలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు.

ఉత్సవాల ప్రారంభానికి ముందుగా ఈనెల 14న ఆయుష్య హోమం నిర్వహించనుండగా, 15న అంకురార్పణ, ధ్వజారోహణం, బలిహరణం, నీరాజనం వంటి పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. 16న ఉదయం ప్రత్యేక పూజలు, సాయంత్రం పార్వతీ పరమేశ్వరుల కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహిస్తారు. 17న‌ శనివారం ఉదయం 9 గంటలకు ప్రాతరౌపాసన, బలిహరణం, నీరాజనం, మంత్రపుష్పం, తీర్థప్రసాద వినియోగం, సాయంత్రం నాలుగు గంటలకు సాయమౌపాసన, సదస్యం, బలిహరణం, నీరాజనం అశ్వవాహనసేవ, మంత్రపుష్పం, తీర్థప్రసాద వినియోగం, 18 ఆదివారం ఉదయం 9 గంటలకు గవ్యాంత పూజలు, అమ్మవారికి అభిషేకం, సహస్రనామార్చన, (కుంకుమార్చన), రుద్రాభిషేకం, రుద్రహోమం. సాయంత్రం ఐదు గంటలకు సాయమౌపాసన, శ్రీ సూక్త, దుర్గా సూక్త హోమములు, నందివాహనసేవ మృగయాత్ర వినోదం, నీరాజన మంత్రపుష్పం, తీర్థప్రసాద వినియోగం.

19న‌ సోమవారం ఉదయం 9 గంటలకు గవ్యాంత పూజలు, రుద్రాభిషేకం, రుద్రహోమం, అవాహిత దేవత హోమములు, మూర్తి హోమం, శేష హోమం, పూర్ణాహుతి. వసంతోత్సవం, శేషవాహనసేవ, త్రిశులస్నానం, ధ్వజావరోహణం, పుష్పోత్సవం, ఏకాంతసేవ మహదాశీర్వచనం, పండితసత్కారం నిర్వహించబడునని వారు తెలిపారు.

Umamaheswara

అలాగే తేది 16-01-2026 శుక్రవారం నుండి తేది 22-01-2026 గురువారం వరకు పాపనాశనం నందు ఉత్తరాయణ పుణ్యకాలస్నానములు, ప్రత్యేక పూజలు జరుగును. తదుపరి రోజుల్లో పల్లకీ సేవలు, వాహన సేవలు, శోభాయాత్రలు భక్తుల మన్ననలు పొందనున్నాయి. శ్రీ స్వామి వారి బ్రహోత్సవములు (జాతర) శైవాగమ శాస్త్ర ప్రకారంగా పరంపర ప్రధానార్చకులు శివశ్రీ పాపకంటి రాంమూర్తి, వీరయ్యశాస్త్రి, నీలకంఠ శాస్త్రి ఆధ్వర్యమున అత్యంత వైభవంగా జరుగును.

Umamaheswara

బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలు, పూల అలంకరణలతో సుందరంగా ముస్తాబు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు, ఈ పవిత్ర బ్రహ్మోత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ ఛైర్మన్ బీరం మాధవరెడ్డి, కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసరావు కోరారు.