పిడుగుపాటుకు ఇద్దరు గిరిజన మహిళా కూలీల మృతి

  • మరో నలుగురికి తీవ్ర గాయాలు..
  • పొలంలో వరి నారు ఊడుస్తుండగా ఘటన

మందస (పలాస), ఆంధ్రప్రభ: శ్రీకాకుళం జిల్లా మందస మండలం బుడారి సింగి గ్రామ పంచాయతీ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. పాతకోట, పెడంగో గిరిజన గ్రామాలకు చెందిన ఇద్దరు మహిళా కూలీలు పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు.

పాతకోటకు చెందిన కే. సోముద్రి, పెడంగోకు చెందిన సవర జొరలపై పిడుగు పడటంతో వారు ప్రాణాలు కోల్పోయారు. వీరితో పాటు ఉన్న మజ్జి దేవకి, బుయా పోరోమి, కుమారో నీలా, కట్టువ సుస్మిత తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో హరిపురం ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

గిరిజన మహిళా కూలీలంతా పొలంలో వరి నారు ఊడుస్తుండగా ఒక్కసారిగా పిడుగు పడింది. దీంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఈ ఘటనతో పాతకోట, పెడంగో గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.