జర్నలిస్టుపై దాడి అమానుషం

జర్నలిస్టుపై దాడి అమానుషం

నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి: టీయూడబ్ల్యూజే (ఐజేయు) నాయకులు

నిజాంపేట, ఆంధ్రప్రభ: ప్రభుత్వ స్థలంలో అక్రమంగా ఏర్పాటు చేసిన షాపులకు గ్రామ పంచాయతీ నోటీసులు జారీ చేసిన అంశంపై వార్త ప్రచురించిన మన తెలంగాణ విలేకరి రాఘవేంద్రపై జరిగిన దాడిని టీయూడబ్ల్యూజే (ఐజేయు) మండల అధ్యక్షుడు మహమ్మద్ అజ్గర్ తీవ్రంగా ఖండించారు.

ఈ ఘటనకు సంబంధించి మంగళవారం జర్నలిస్టు యూనియన్ నాయకులతో కలిసి నిజాంపేట పోలీస్ స్టేషన్‌తో పాటు తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే జర్నలిస్టులపై దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే చర్య అని అన్నారు.

నిజాలను నిర్భయంగా రాసే విలేకరుల గొంతు నొక్కేందుకు చేసే ప్రయత్నాలను సహించబోమని హెచ్చరించారు. జర్నలిస్టుల భద్రతకు ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.

దాడికి పాల్పడిన వ్యక్తులను వెంటనే గుర్తించి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో పోలీసులు కాలయాపన చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే (ఐజేయు) యూనియన్ సభ్యులు జీడీ చంద్రకాంత్ గౌడ్, బండారి సిద్ధరాములు, పప్పుల భరత్ రెడ్డి, కుర్మా బాల్‌రాజ్, శ్రీకాంత్, చంద్రశేఖర్, ప్రదీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.