బాసర ఆలయాన్ని సందర్శించిన అధికారుల బృందం..

బాసర, ఆంధ్రప్రభ: నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో చేపట్టనున్న అభివృద్ధి పనులను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ ఈఎన్‌సీ వసంత నాయక్ నేతృత్వంలోని అధికారుల బృందం శనివారం పరిశీలించింది.

ఈ సందర్భంగా ఆలయ ఈవో అంజనీదేవి, స్థాపతి మోతీలాల్, ఆర్కిటెక్ట్ మాధవీలత, ఇంజినీరింగ్ అధికారులు కలిసి గర్భాలయ పరిసరాలను పరిశీలించారు. అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తులను ప్రతిష్ఠించనున్న బాలాలయాన్ని సందర్శించారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేపట్టనున్న క్యూ లైన్, అక్షరాభ్యాస మండపం తదితర అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రాంతాలను అధికారులు పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, సిబ్బంది వెంట ఉన్నారు.

అమ్మవారిని దర్శించుకున్న అధికారులు

పరిశీలన అనంతరం రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ ఈఎన్‌సీ వసంత నాయక్, స్థాపతి మోతీలాల్, ఆర్కిటెక్ట్ మాధవీలత శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక కుంకుమార్చన నిర్వహించి, హారతి ఇచ్చి ఆశీర్వచనం అందజేశారు.