మహనీయుల ఆశయాలే స్వాతంత్య్రానికి స్ఫూర్తి
మహనీయుల కలలను సాకారం చేయడమే నిజమైన నివాళి
దేశభక్తి అంటే జెండా వందనమే కాదు.. బాధ్యతగా మెలగడమూ
విద్యార్థులు బాధ్యతగల పౌరులుగా ఎదగాలి: శివమణి కుమార్
వరంగల్, వర్ధన్నపేట, ఆంధ్రప్రభ : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో శనివారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. పాఠశాల ఆవరణలో జరిగిన కార్యక్రమానికి గ్రామ ప్రముఖులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరై జాతీయ జెండాకు వందనం చేశారు.
ఈ సందర్భంగా పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న మల్లెపాక శివమణి కుమార్ చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. స్వాతంత్య్రం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన మహనీయులను కేవలం జాతీయ పర్వదినాల్లో స్మరించుకోవడం మాత్రమే కాకుండా, వారు కలలుగన్న సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు సాగాలని అన్నారు.
మహనీయుల ఆశయాలను నెరవేర్చడమే వారికి మనం ఇచ్చే నిజమైన ఘన నివాళి అని శివమణి కుమార్ పేర్కొన్నారు. దేశం కోసం పోరాడిన స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను నేటి తరం తెలుసుకోవడంతో పాటు, వారి విలువలను ఆచరణలో పెట్టాలని సూచించారు. దేశభక్తి అంటే కేవలం జాతీయ జెండాను ఆవిష్కరించడం, జాతీయ గీతాన్ని ఆలపించడం మాత్రమే కాదని, దేశం పట్ల బాధ్యతగా వ్యవహరించడం, సమాజం పట్ల సేవాభావంతో మెలగడం కూడా దేశభక్తిలో భాగమేనని వివరించారు.
మహాత్మా గాంధీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, భగత్‌సింగ్ తదితర మహనీయులు సమాజానికి అందించిన స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. విద్యార్థులు క్రమశిక్షణ, నిజాయితీ, సమానత్వం, సోదరభావం వంటి విలువలను అలవర్చుకుంటే దేశ భవిష్యత్తు మరింత బలపడుతుందని పేర్కొన్నారు.
స్వాతంత్య్రం సాధించి దశాబ్దాలు గడిచినా పేదరికం, నిరక్షరాస్యత, సామాజిక అసమానతలు వంటి సమస్యలు పూర్తిగా తొలగిపోలేదని అన్నారు. వాటి నిర్మూలనకు విద్యార్థులు కూడా తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు. ప్రతి విద్యార్థి బాగా చదివి బాధ్యతగల పౌరుడిగా ఎదగడం ద్వారా దేశ అభివృద్ధిలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.
ఇల్లంద ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఈ వేడుకలు కేవలం జాతీయ పర్వదిన కార్యక్రమంగా కాకుండా మహనీయుల త్యాగాలు, వారి ఆశయాలు, నేటి తరంపై ఉన్న బాధ్యతను గుర్తుచేసే వేదికగా నిలిచాయి. చిన్న వయసులోనే శివమణి కుమార్ వ్యక్తం చేసిన ఆలోచనలు విద్యార్థుల్లో దేశభక్తి, సామాజిక బాధ్యతను పెంపొందించేలా ఉన్నాయని కార్యక్రమానికి హాజరైన పలువురు అభినందించారు.
