మొక్కజొన్న కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం..

మొక్కజొన్న కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం..
రైతుల పంటలపై అంచనాలేని జిల్లా వ్యవసాయ అధికారులు
ఇతర పట్టణాల గోదాములకు తరలించాలన్న తీరు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిర్లక్ష్యం
బకాయిల జాప్యంతో అల్లాడుతున్న మక్క రైతులు
కలెక్టర్ కరుణించి కొనుగోలు వేగవంతం చేసేందుకు కృషి చేయాలి
గుండాల/ ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : మండలంలో పిఏసిఎస్ కొనుగోలు కేంద్రంలో నెలల తరబడి నిల్వ ఉన్న మొక్కజొన్న ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని, రైతుల పంటల పై మండల జిల్లా రాష్ట్ర వ్యవసాయ అధికారులకు అంచనా లేకపోవడంతో నిల్వ ఉన్న మొక్కజొన్నలను ఇతర పట్టణాల కొనుగోలు కేంద్రాలకు తరలించాలని అధికారులు చెబుతున్నా సాకుతో రైతులు తీవ్ర ఇబ్బందకి గురవుతున్నారని, కొనుగోలు చేసిన ధాన్యానికి రైతు ఖాతాలో జమ చేయాలని, తెలంగాణ రాష్ట్ర రైతు కూలీ సంఘం కోశాధికారి మూఢ్ శోభన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా గుండాల మండల కేంద్రం కొనుగోలు కేంద్రం సందర్శించి రైతు సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు.
అనంతరం రాష్ట్ర కోశాధికారి మూఢ్ శోభన్ పాల్గొని మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తుత యాసంగి (రబీ) సీజన్‌లో మొక్కజొన్న సాగు, దిగుబడి రికార్డు స్థాయిలో పెరిగినప్పటికీ, క్షేత్రస్థాయిలో కొనుగోళ్ల మందగమనంతో మార్కెట్ ధరల పతనంతో బకాయిల జాప్యం కారణంగా రైతాంగం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోందని, అనుకూల వాతావరణం, నీటి లభ్యత వల్ల ఏడాది రికార్డు స్థాయి పంటపండినా, రైతులకు లాభాలు తీసుకురావడానికి బదులు కన్నీళ్లను మిగులుస్తోందని మండిపడ్డారు. 30 రోజుల నుండి మొక్కజొన్న ధాన్యం కొనుగోలు కేంద్రానికి తెచ్చిన రైతులు లునావత్ మంగీలాల్, కృష్ణా ఎదుర్కొంటున్న సమస్యలను కలిసివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరానికి 40 నుండి 45 క్వింటాళ్ల దిగుబడి వస్తే.. కేవలం 24 క్వింటాలనే కొనుగోలు చేస్తున్నారన్నారు.
మిగతాది ప్రైవేట్ వ్యాపారస్తులకు రూ.600 నుండి రూ 800కు తక్కువకు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని, ఆందోళన వ్యక్తం చేశారు. పంట ఆన్లైన్ లో నమోదు కాకుంటే కొనుగోలు చేయడం లేదన్నారు. యాసంగి సీజన్‌లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20.29 లక్షల ఎకరాల్లో రికార్డు స్థాయిలో మొక్కజొన్న సాగైందని దీని ద్వారా మొత్తం ఉత్పత్తి దాదాపు 47.23 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉందని అంచనా వేస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర (ఎంఎస్పి) కంటే బహిరంగ మార్కెట్‌లో ధరలు దారుణంగా పడిపోయాయని, కేంద్ర మద్దతు ధర 2,400(క్వింటాకు)బహిరంగ మార్కెట్ దళారుల ధర1,600 నుంచి1,800లకే విక్రయించాల్సి ఉందని, దీనివల్ల రైతుకు క్వింటాకు 600 నుండి 800 వరకు నష్టపోవాల్సి వస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా ఇప్పటికే దాదాపు12.85 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేసినా, రైతులకు చెల్లించాల్సిన సుమారు 3,084 కోట్లకు పైగా బకాయిలు నిలిచిపోయాయని గుర్తు చేశారు.
పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులకు చక్ర వడ్డీలతో అమాంతంగా పెరిగిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. పెరిగిన దిగుబడికి తగ్గట్టుగా రాష్ట్రంలో నిల్వ సామర్థ్యం ఏర్పాట్లు లేక అవసరమైన15.53లక్షల మెట్రిక్ టన్నుల సామర్ధ్యం గాను, ప్రస్తుతం12.75 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యమే అందుబాటులో ఉండడంతో కొనుగోలు కేంద్రాల వద్దే టన్నుల కొద్దీ మొక్కజొన్నలు నిల్వలు ఎండకు ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఏఐకేఎస్ భద్రాద్రి జిల్లా కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల (ఐకేపీ సెంటర్లు) వద్ద గన్నీ సంచుల (గోనెసంచులు) కొరత, రవాణా లారీల కొరత వేధిస్తోందని,రవాణా,హమాలీ కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్‌లో ఉండటం మూలాన వారు సైతం నిరసనలకు దిగుతున్నారని గుర్తు చేశారు.
తీవ్రఎండలు, వడగాల్పులకు మధ్యాహ్నం పూట కొనుగోళ్లు నిలిచిపోతుండటంతో, రైతులు మార్కెట్ యార్డుల్లోనే రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోందని,కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రైస్ సపోర్ట్ స్కీమ్ (పిఎస్ఎస్)కింద ఆశించిన స్పందన రాకపోవడం, రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా రంగంలోకి దిగిందని, రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి మొక్కజొన్న కొనుగోళ్ల కోసం అదనంగా1,800 కోట్లను ప్రత్యేకంగా కేటాయించారని, కొనుగోళ్లను వేగవంతం చేసేందుకు మార్క్‌ఫెడ్‌కు 4,172.94 కోట్ల బ్యాంక్ గ్యారంటీని ప్రభుత్వం ఇచ్చిందని, జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్సిడిసి)నుంచి ఈ రుణం విడుదల కావాల్సి ఉందని, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 336 కొనుగోలు కేంద్రాల ద్వారా మక్కల సేకరణలు జరుగుతోందని, పంట చివరి గింజ వరకు మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఉన్నలారీల కొరత, గోనెసంచుల కొరతను తక్షణమే తీర్చాలని, ప్రధానంగా ఎన్‌సీడీసీ నుంచి రావాల్సిన రుణ ప్రక్రియను వేగవంతం చేసి, రైతుల ఖాతాల్లో 3,084 కోట్ల బకాయిలు తక్షణమే జమచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అకాల వర్షాలకు తడిసిన పంటను కొనుగోలు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ, గ్రామీణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు శంకరన్న, గుర్రాల నాగన్న, తోలెం గోపి, భూపాల్,దుగ్గి రామ్మూర్తి, వాగబోయిన నర్సింహారావు,గడ్డం క్రిష్ణ, ఎరెం రామకృష్ణ,కల్తీ సమ్మయ్య, కల్తీ శేఖర్,జోగ రాజేష్, కల్తీ రామస్వామి, ఈసం బుచ్చయ్య, కుంజ సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.
