టమోటా రైతులకు గుడ్‌న్యూస్..

టమోటా రైతులకు గుడ్‌న్యూస్..

మరో రెండు నెలల్లో ప్రాసెసింగ్ యూనిట్ సిద్ధం

గిట్టుబాటు ధరల కోసం నిర్మాణ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : టమోటా రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తులకు విలువ ఆధారిత మార్కెట్ అవకాశాలు అందించేందుకు నిర్మిస్తున్న టమోటా ప్రాసెసింగ్ యూనిట్ పనులను వేగవంతం చేసి మరో రెండు నెలల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి అధికారులను ఆదేశించారు.

బుధవారం పత్తికొండ మండలం దూదేకొండ గ్రామ సమీపంలోని కనకతిన్న ప్రాంతంలో నిర్మాణ దశలో ఉన్న టమోటా ప్రాసెసింగ్ యూనిట్‌ను కలెక్టర్ పరిశీలించారు. యూనిట్‌లో కొనసాగుతున్న సివిల్ పనులు, యంత్రాల ఏర్పాటు, మౌలిక సదుపాయాల పురోగతిని సమీక్షించి అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, టమోటా రైతులు మార్కెట్ ధరల హెచ్చుతగ్గుల వల్ల నష్టపోకుండా ఉండేందుకు గత ఏడాది ఈ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. యూనిట్‌కు సంబంధించిన ప్రాథమిక, ద్వితీయ ప్రాసెసింగ్ విభాగాల సివిల్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయని, యంత్రాల కొనుగోలుకు వర్క్ ఆర్డర్లు జారీ చేసినట్లు వెల్లడించారు.

మరో రెండు నెలల్లో యంత్రాల ఏర్పాటు పూర్తి చేసి ఉత్పత్తి ప్రక్రియను ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఈ కేంద్రంలో టమోటా కెచప్, టమోటా పల్ప్, టమోటా సాస్ తయారీ చేపట్టనున్నట్లు తెలిపారు.

టమోటా సీజన్ అనంతరం మామిడి, అరటి, జామ వంటి పండ్ల ప్రాసెసింగ్‌కు కూడా యూనిట్‌ను వినియోగించేలా ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు. యూనిట్‌లో గంటకు 6 టన్నుల టమోటా పల్ప్ ఉత్పత్తి సామర్థ్యం ఉండగా, రోజుకు సుమారు 3 మెట్రిక్ టన్నుల కెచప్ తయారీ సామర్థ్యం ఉంటుందని తెలిపారు. నెలకు దాదాపు 1,200 మెట్రిక్ టన్నుల టమోటాలను ప్రాసెస్ చేసే సామర్థ్యంతో ఈ కేంద్రం పనిచేయనుందని వివరించారు.

టమోటా ధరలు పడిపోయే సమయంలో రైతుల నుంచి నేరుగా ఉత్పత్తిని కొనుగోలు చేసి ప్రాసెసింగ్ చేయడం ద్వారా వారికి గిట్టుబాటు ధర లభించేలా ఈ యూనిట్ కీలక పాత్ర పోషిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. అలాగే విలువ ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని తెలిపారు.

నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి యూనిట్‌ను త్వరితగతిన రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో పత్తికొండ ఆర్డీవో ఓబులేసు, తహసీల్దార్ రామేశ్వర రెడ్డి, ఏపీఎంఐపీడీ శ్రీనివాసులు తదితర అధికారులు పాల్గొన్నారు.