ప్రజా సమస్యలను ఓపికగా విని అక్కడికక్కడే పరిష్కారం

గుడివాడ, ఆంధ్రప్రభ: గుడివాడ పట్టణం 26వ వార్డు కార్మిక నగర్ సచివాలయం వద్ద ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా వార్డు ప్రజల నుంచి ఎమ్మెల్యే రాము వివిధ సమస్యలకు సంబంధించిన అర్జీలను స్వీకరించారు. ప్రతి ఒక్కరి సమస్యలను ఓపికగా విన్న ఎమ్మెల్యే… సమస్యలకు గల కారణాలను అక్కడే ఉన్న అధికారులు, సచివాలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించిన ఎమ్మెల్యే రాము… ఆర్థికపరమైన అంశాలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి కొంత సమయం పట్టినా… తప్పకుండా పరిష్కరిస్తామని ప్రజలకు భరోసా ఇచ్చారు.

ముందుగా జరిగిన సభలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ…ప్రజలు ఇచ్చిన ప్రతి అర్జీని ప్రజా సమస్యల పరిష్కార వేదిక వెబ్‌సైట్‌లో నమోదు చేస్తామని తెలిపారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కల్పించిన ఒక చక్కటి వ్యవస్థ అని… ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సచివాలయం, మున్సిపల్ కార్యాలయం, ప్రజా వేదిక కార్యాలయంలో ప్రజలు తమ సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చని ఎమ్మెల్యే రాము తెలిపారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 26వ వార్డులో రూ.3.50 కోట్లకు పైగా సంక్షేమ నిధులు అందించామని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

గుడివాడ పట్టణంలో అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నామని… ప్రతి ఇంటికీ తాగునీరు అందిస్తున్నామని ఎమ్మెల్యే రాము తెలిపారు. గతంలో ప్రచారం కోసం ట్యాంకర్లను తిప్పే పరిస్థితి ఉండేదని… ప్రస్తుతం ఆ పరిస్థితిని మార్చే దిశగా చర్యలు చేపట్టామని అన్నారు.

పట్టణ పరిశుభ్రత విషయంలో ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించాలని ఎమ్మెల్యే రాము కోరారు. మన ఇల్లు మాత్రమే కాకుండా… పరిసరాలు, మన వీధులు కూడా పరిశుభ్రంగా ఉండేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు.ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా… పారిశుధ్య కార్మికులకు ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే రాము కోరారు. స్వచ్ఛ గుడివాడ రూపకల్పనలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పిలుపునిచ్చారు.

ప్రజా దర్బార్ ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని… సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే రాము తెలిపారు.

ప్రజా దర్బార్ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్, తాసిల్దార్ ప్రసాద్, గుడివాడ మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, జనసేన ఇన్చార్జ్ బూరగడ్డ శ్రీకాంత్,పట్టణ టిడిపి అధ్యక్షులు పండ్రాజు సాంబశివరావు, సీనియర్ టిడిపి నాయకులు పిన్నమనేని బాబ్జి, లింగం ప్రసాద్, గోర్జీ సత్యనారాయణ, చేకూరు జగన్మోహన్రావు, టిడిపి నేతలు బొంబాయి శ్రీను, క్లస్టర్ ఇంచార్జ్ నేరుసు కాశి, కాగిత శివశంకర్, రెడ్డిఅప్పారావు, యేసుపాదం, నిరంజన్, లోయ విజయ్, వార్డు నాయకులు పైడిముక్కల వంశీ, షేక్ నాగూర్ భాష,షేక్ మహబూబ్ సుభాని, దావూద్ అమిర్ భాష, ఎలక్ట్రికల్ ఏఈ బ్రహ్మానందం, ఆర్ఐ నందు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది స్థానిక ప్రజలు పాల్గొన్నారు.