దోచుకున్న ఇంట్లోనే కునుకు..

  • చోరీ ప్లాన్ గంజాయిపాలు…

హైదరాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : దొంగతనం చేయాలనుకున్నాడు.. చక్కగా పథకం వేసుకున్నాడు.. ఇంట్లోకి చొరబడి బంగారు ఆభరణాలు కూడా ఎత్తుకెళ్లాడు. కానీ చివరికి చోరీ చేసిన ఇంట్లోనే నిద్రపోయి పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన హైదరాబాద్‌ పహాడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

వాడీ-ఎ-ముస్తఫా ప్రాంతానికి చెందిన ఓ యువకుడు గంజాయి మత్తులో అదే ప్రాంతంలోని ఓ ఇంటిని టార్గెట్‌ చేశాడు. ఇంటికి తాళం వేసి ఉండటంతో అదును చూసుకుని లోపలికి ప్రవేశించాడు. అనంతరం కబోర్డులో ఉన్న బంగారు ఆభరణాలను తీసుకుని జేబులో పెట్టుకున్నాడు. ఇంతవరకు అంతా అనుకున్నట్టుగానే సాగింది. ఇక అక్కడి నుంచి బయటపడాల్సిన సమయంలో మత్తు అతడిపై పైచేయి సాధించింది. గంజాయి ప్రభావంతో ఇంట్లోనే నేలపై పడుకుని గాఢ నిద్రలోకి జారుకున్నాడు.

కొంతసేపటి తర్వాత ఇంటి సభ్యులు తిరిగి వచ్చారు. ఇంటి తలుపులు తెరిచి ఉండటం, వస్తువులు చెల్లాచెదురుగా కనిపించడంతో అనుమానం వచ్చింది. లోపలికి వెళ్లి చూడగా.. ఓ అపరిచిత వ్యక్తి ప్రశాంతంగా నిద్రపోతూ కనిపించాడు. పక్కనే తెరిచి ఉన్న కబోర్డు, అతడి జేబులో ఉన్న బంగారు ఆభరణాలను చూసి అసలు విషయం అర్థమైంది. వెంటనే కుటుంబ సభ్యులు నిందితుడి వీడియోలు తీసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పహాడీషరీఫ్‌ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాను మత్తులో ఏం చేశానో తనకే తెలియదని, క్షమించాలని నిందితుడు కోరుతున్న వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. చోరీకి వెళ్లిన దొంగ.. బయటపడే మార్గం మరిచి నిద్రలోకి జారుకోవడం స్థానికంగా ఆసక్తికర చర్చకు దారితీసింది.