విజయవాడకు మరిన్ని విమాన సర్వీసులు..

  • కొచ్చిన్‌కు త్వరలో కొత్త కనెక్టివిటీ
  • తొలి రోజే 130 మంది ప్రయాణికులతో వారణాసి విమానం
  • విజయవాడ విమానాశ్రయ సామర్థ్యానికి నిదర్శనం
  • శబరిమల యాత్రకు ముందే కొచ్చిన్‌ సర్వీస్‌ తీసుకురావాలని కేంద్ర మంత్రిని కోరాం
  • ఈ ఏడాదిలోనే నూతన టెర్మినల్‌ ప్రారంభం
  • మరిన్ని ప్రాంతాలకు విమాన కనెక్టివిటీ పెరిగే అవకాశం
  • వాణిజ్యం, విద్య, ఉద్యోగ రంగాలకు మెరుగైన అవకాశాలు కల్పించడమే లక్ష్యం
  • విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని

విజయవాడ, ఆంధ్రప్రభ: విజయవాడ విమానాశ్రయం నుంచి వారణాసి మీదుగా కోల్‌కతాకు కొత్త విమాన సర్వీస్‌ ప్రారంభమైన తొలి రోజే సుమారు 130 మంది ప్రయాణికులు ప్రయాణించడం విజయవాడకు ఉన్న విమానయాన సామర్థ్యానికి నిదర్శనమని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పేర్కొన్నారు. విజయవాడ నుంచి మరిన్ని ప్రాంతాలకు విమాన కనెక్టివిటీ పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, త్వరలో కొచ్చిన్‌కు కూడా విమాన సర్వీస్‌ అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని ఆయన వెల్లడించారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విజయవాడ–వారణాసి–కోల్‌కతా నూతన విమాన సర్వీస్‌ను గురువారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు వర్చువల్‌గా ప్రారంభించారు. ఎంపీ వల్లభనేని బాలశౌరి వర్చువల్‌గా కార్యక్రమంలో పాల్గొనగా, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు విమానాశ్రయంలో జరిగిన కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. నూతన సర్వీస్‌ ప్రారంభోత్సవ సందర్భంగా వారణాసి విమానానికి తొలిసారిగా టికెట్‌ రిజర్వేషన్‌ చేసుకున్న ప్రయాణికుడికి ఎంపీ చిన్ని, ఎమ్మెల్యే వెంకట్రావు టికెట్‌ను అందజేశారు.

కొచ్చిన్‌ సర్వీస్ త్వరలో…

ఇండిగో సంస్థ సహకారంతో కొత్త విమాన సర్వీస్‌ను ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందని ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. తొలి రోజే సుమారు 130 మంది ప్రయాణికులతో విమానం బయలుదేరడం ద్వారా విజయవాడ విమానాశ్రయానికి ఉన్న డిమాండ్‌, సామర్థ్యం స్పష్టమవుతోందని అన్నారు. విజయవాడ నుంచి మరిన్ని కీలక నగరాలకు విమాన సర్వీసులు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలో కొచ్చిన్‌కు కూడా విమాన సర్వీస్‌ ప్రారంభించాలని కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడిని ఇప్పటికే కోరినట్లు చిన్ని తెలిపారు. శబరిమల యాత్ర ప్రారంభానికి ముందే కొచ్చిన్‌ విమాన సర్వీస్‌ అందుబాటులోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌ నుంచి శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు శబరిమల యాత్రకు వెళ్తారని, ఈ నేపథ్యంలో సర్వీస్‌ను త్వరగా అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఇందుకోసం ఇండిగో సంస్థ సహకారాన్ని కూడా కోరినట్లు వెల్లడించారు. కొచ్చిన్‌ విమాన సర్వీస్‌ విషయంలో కేంద్ర మంత్రి కూడా సానుకూలంగా ఉన్నారని తెలిపారు.

నూతన టెర్మినల్‌తో పెరగనున్న కనెక్టివిటీ..

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో నూతన టెర్మినల్‌ భవన నిర్మాణాన్ని ఈ ఏడాదిలోనే పూర్తి చేసి అత్యంత వైభవంగా ప్రారంభిస్తామని ఎంపీ చిన్ని తెలిపారు. కొత్త టెర్మినల్‌ అందుబాటులోకి వస్తే విమానాశ్రయ సామర్థ్యం మరింత పెరిగి, దేశంలోని మరిన్ని ప్రాంతాలకు కొత్త విమాన సర్వీసులు ప్రారంభించే అవకాశం ఉంటుందని అన్నారు. మెరుగైన విమాన కనెక్టివిటీ ద్వారా విజయవాడ, ఎన్టీఆర్‌ జిల్లా, కృష్ణా ప్రాంతాల్లో వాణిజ్యం, విద్య, ఉద్యోగ అవకాశాలు మరింతగా విస్తరించే అవకాశం ఉందని పేర్కొన్నారు.

విజయవాడ విమానాశ్రయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి మరిన్ని విమాన సర్వీసులు తీసుకురావాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు చేస్తున్న కృషికి ఎంపీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో విమానాశ్రయ డైరెక్టర్‌ ఎం.లక్ష్మీకాంత్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఇంజినీరింగ్‌ ప్రాజెక్ట్స్‌) కే.రామాచారి, ఇండిగో స్టేషన్‌ మేనేజర్‌ కౌశిక్‌ విశాల్‌, విమానాశ్రయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.