సీఎం పర్యటనకు పటిష్ట భద్రత
1,200 మంది పోలీసులతో భారీ బందోబస్తు..
అప్రమత్తంగా విధులు నిర్వహించాలి: ఎస్పీ విక్రాంత్ పాటిల్
కర్నూలు ప్రతినిధి, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం పత్తికొండ నియోజకవర్గంలోని జొన్నగిరిలో ఉన్న జియో మైసూర్ గోల్డ్ మైన్స్ ప్లాంట్‌ను సందర్శించనున్న నేపథ్యంలో జిల్లా పోలీసు శాఖ విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసింది.

ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా హెలిప్యాడ్, సభా ప్రాంగణం, ఇతర కీలక ప్రాంతాల్లో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పర్యవేక్షణలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
బందోబస్తు విధుల కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పోలీసు అధికారులు, సిబ్బందికి జొన్నగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని పగిడిరాయి గ్రామంలో గోల్డ్ మైన్స్ సమీపంలో ఎస్పీ విక్రాంత్ పాటిల్ దిశానిర్దేశం చేశారు.

భద్రతా ఏర్పాట్లలో భాగంగా 1,200 మంది పోలీసు సిబ్బందిని విధుల్లో నియమించారు. వీరిలో ముగ్గురు అదనపు ఎస్పీలు, 14 మంది డీఎస్పీలు, 40 మంది సీఐలు, 76 మంది ఎస్సైలు, 300 మంది ఏఆర్, ఏపీఎస్పీ, స్పెషల్ పార్టీ పోలీసు సిబ్బంది పాల్గొంటున్నారు.
విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా విధులు నిర్వహించాలని ఎస్పీ ఆదేశించారు. భద్రతా చర్యలను సమన్వయంతో అమలు చేసి ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కర్నూలు అదనపు ఎస్పీ హుస్సేన్ పీరా, కడప అదనపు ఎస్పీ ప్రకాష్ బాబు, నంద్యాల అదనపు ఎస్పీ చిన్ని కృష్ణ, సీఐలు, ఆర్‌ఐలు, ఎస్సైలు, ఆర్‌ఎస్‌ఐలు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
