సమస్యల వలయంలో గిరిజన ఆశ్రమ పాఠశాల
- భవనం, స్థల ప్రొసీడింగ్స్ కోసం విద్యార్థులు, తల్లిదండ్రుల విజ్ఞప్తి
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి పట్టణంలోని గిరిజన సంక్షేమ శాఖ ఐటీడీఏ ఆధ్వర్యంలో నడుస్తున్న వైటీసీ (YTC) ప్రాంగణంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల అనేక సమస్యల మధ్య కొనసాగుతోందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల పరిస్థితిని ఎమ్మెల్యే గడ్డం వినోద్, జిల్లా కలెక్టర్, ఉట్నూర్ ఐటీడీఏ పీవో, స్థానిక సబ్ కలెక్టర్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు.
పాఠశాలలో నాలుగో, ఐదో తరగతుల్లో ప్రవేశాల కొరత కనిపిస్తున్నప్పటికీ, ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వైటీసీ భవనంలో మొత్తం 32 గదులు ఉండగా, వాటిలో 22 గదులు వైటీసీ ఆధీనంలోనే ఉన్నాయి. మిగిలిన 10 గదుల్లోనే ఆశ్రమ పాఠశాల కొనసాగుతోంది. విద్యార్థులకు సరిపడా డార్మిటరీలు, తరగతి గదులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

2018-19లో లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన స్టీమ్ కిచెన్ పరికరాలు ప్రారంభం నుంచే పనిచేయకపోవడంతో అవి వంటగదిలో నిరుపయోగంగా పడి ఉన్నాయని గిరిజనులు వాపోతున్నారు. దాదాపు 210 మంది విద్యార్థులు చదువుతున్న ఈ పాఠశాల బెల్లంపల్లిలో ఏర్పడి దశాబ్దానికి పైగా గడిచినా, ఇప్పటివరకు సొంత భవనం మంజూరు కాకపోవడంతో కొన్ని తరగతులను ఆరుబయట నిర్వహించాల్సి వస్తోందని తెలిపారు.
2019లో కన్నాల గ్రామపంచాయతీ పరిధిలోని జాతీయ రహదారి-363 పక్కన సర్వే నంబర్లు 70, 79లలో ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని పాఠశాలకు కేటాయించినప్పటికీ, ఇప్పటివరకు ఆ భూమికి సంబంధించిన ప్రొసీడింగ్స్ కాపీని రెవెన్యూ శాఖ అందించలేదని పేర్కొన్నారు. దీంతో కొత్త భవన నిర్మాణం కూడా ఆలస్యమవుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా, ఐటీడీఏ రూ.1 కోట్ల వ్యయంతో నిర్మించిన పోస్ట్ మెట్రిక్ హాస్టల్ భవనాన్ని 2024 డిసెంబర్ 8న ఎమ్మెల్యే గడ్డం వినోద్, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రారంభించారు. అయితే విద్యార్థులు చేరకపోవడంతో ఆ భవనం ఖాళీగా ఉండగా, ప్రస్తుతం ఆశ్రమ పాఠశాల విద్యార్థుల డార్మిటరీ అవసరాల కోసం రెండు గదులను వినియోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
బెల్లంపల్లి ప్రధాన రహదారి పక్కన ఉన్న ఈ పాఠశాలలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తే ప్రవేశాలు మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం పాఠశాల హెడ్మాస్టర్, సిబ్బంది కృషితో విద్యార్థుల సంఖ్య 169కు చేరుకోగా, త్వరలోనే అది 210కు పెరిగే అవకాశముందని తెలిపారు.
ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే గడ్డం వినోద్, సబ్ కలెక్టర్, ఉట్నూర్ ఐటీడీఏ పీవో స్పందించి పాఠశాలకు సొంత భవనం మంజూరు చేయడంతో పాటు, కేటాయించిన ఐదు ఎకరాల భూమికి సంబంధించిన ప్రొసీడింగ్స్ జారీ చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
పాఠశాలకు భవనం, స్థల ప్రొసీడింగ్స్ ఇప్పించాలి
పాఠశాల హెడ్‌మాస్టర్ అజ్మర నరసింహ

బెల్లంపల్లిలోని గురుజాల రోడ్డులో ఉన్న గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలకు కొత్త భవనం మంజూరు చేయడంతో పాటు, పాఠశాలకు కేటాయించిన ఐదు ఎకరాల భూమికి సంబంధించిన ప్రొసీడింగ్స్ జారీ చేయాలని ఎమ్మెల్యే గడ్డం వినోద్‌కు విన్నవించినట్లు హెడ్‌మాస్టర్ అజ్మర నరసింహ తెలిపారు. ఈ విషయాన్ని ఉట్నూర్ ఐటీడీఏ పీవో దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు చెప్పారు. ప్రస్తుతం మరుగుదొడ్ల మరమ్మతు పనులు కొనసాగుతున్నాయని, ఎమ్మెల్యే, ఐటీడీఏ పీవో నుంచి సానుకూల నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు.
