కార్యకర్తలే పార్టీకి బలం..
- టీడీపీ యూనిట్ ఇన్‌చార్జ్‌ల శిక్షణలో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
- ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
మంగళగిరి, ఆంధ్రప్రభ : కార్యకర్తల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడంతో పాటు పార్టీ భావజాలాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా యూనిట్ ఇన్‌చార్జ్‌లకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన శిక్షణా తరగతులకు ఆయన హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లకపోతే తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. పార్టీ భావజాలాన్ని ప్రతి కార్యకర్త అర్థం చేసుకుని, ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజలకు వాస్తవాలను వివరించాలని సూచించారు.
దుష్ప్రచారానికి గట్టిగా కౌంటర్ ఇవ్వాలి
“చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలి” అంటూ ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని ప్రారంభ దశలోనే తిప్పికొట్టాలని చంద్రబాబు సూచించారు. డీఎస్సీ పరీక్షల నిర్వహణ విషయంలో కొందరు తప్పుడు ప్రచారం చేసేందుకు ప్రయత్నించారని, వాస్తవాలను ప్రజలకు వివరించడం ద్వారా దానికి గట్టిగా కౌంటర్ ఇవ్వగలిగామని అన్నారు.
డీఎస్సీ పరీక్షల నిర్వహణలో ఎలాంటి తప్పిదాలు జరగలేదనే విషయాన్ని స్పష్టంగా ప్రజలకు చెప్పగలిగామని, అందుకే కొన్ని పార్టీలకు చెందిన నేతలు కూడా ఎలాంటి తప్పులు జరగలేదని బహిరంగంగా చెప్పారని చంద్రబాబు పేర్కొన్నారు. డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన ప్రచారాన్ని తప్పుపడుతూ ఆందోళనలకు దిగడం ఇందుకు నిదర్శనమన్నారు.
ప్రభుత్వం చేసే మంచి పనులను ప్రజలకు వివరించగలిగితే దుష్ప్రచారాలను ప్రజలే తిప్పికొడతారని అన్నారు. పారదర్శకంగా వ్యవహరిస్తూ వాస్తవాలను ప్రజల ముందు ఉంచితే కుట్రలను ప్రజలే గుర్తిస్తారని పేర్కొన్నారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం ప్రజల భాగస్వామ్యానికి నిదర్శనమని చెప్పారు.
ఆర్థిక ఇబ్బందులున్నా అభివృద్ధి
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఇటీవలే ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చానని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రానికి అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వ్యవస్థలను గాడిలో పెడుతూ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలపై ప్రజలకు వాస్తవాలను వివరించాలని కార్యకర్తలకు సూచించారు.
పార్టీ విధానాలపై జీరో టాలరెన్స్
సాధారణ కార్యకర్త అయినా పార్టీ అగ్రనాయకుడైనా పార్టీయే సర్వోన్నతమని చంద్రబాబు స్పష్టం చేశారు. నియోజకవర్గాల్లో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నానని తెలిపారు. కార్యకర్తలను పట్టించుకోని వారి విషయంలో, పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరించే వారి విషయంలో జీరో టాలరెన్స్ విధానం ఉంటుందని స్పష్టం చేశారు.
ప్రతిపక్ష పార్టీ రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం లేదని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. రానున్న ప్రతి ఎన్నికలోనూ గత ఎన్నికల కంటే ప్రతి బూత్‌లో ఎక్కువ ఓట్లు సాధించేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని సూచించారు.
నాయకుల ప్రవర్తనపైనా దృష్టి
ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకుల ప్రవర్తన కూడా ఎన్నికల్లో ఓట్లపై ప్రభావం చూపుతుందని చంద్రబాబు అన్నారు. ప్రజలతో సన్నిహితంగా ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. యూనిట్, క్లస్టర్ ఇన్‌చార్జ్‌లు, మండల అధ్యక్షులకు పార్టీలో తగిన గౌరవం, ప్రాధాన్యత దక్కేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
