సామాన్యుడి వంటింటిపై పెను భారం..
మూడు నెలల్లో బస్తాపై రూ.300–400 పెంపు
కిలో సన్న బియ్యం రూ.60–70..
రవాణా, మిల్లింగ్ ఖర్చులూ పైపైకి..
హైదరాబాద్, ఆంధ్రప్రభ: నిత్యావసర సరుకులు, కూరగాయలు, పండ్లు, వంటనూనెల ధరల పెరుగుదలతో సతమతమవుతున్న సామాన్యులపై తాజాగా బియ్యం ధరల భారం పడుతోంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణ ప్రభావంతో బియ్యం ధరలు గరిష్ఠ స్థాయికి చేరినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గత మూడు నెలల్లో రకాలను బట్టి చిల్లర మార్కెట్‌లో ఒక్కో బియ్యం బస్తాపై రూ.300 నుంచి రూ.400 వరకు ధర పెరిగింది.
సన్న బియ్యం ధరల పరుగులు
బీపీటీ, హెచ్‌ఎంటీ, జైశ్రీరాం వంటి సన్న రకాల బియ్యం ధరలు భారీగా పెరిగాయి. గతంలో కిలో రూ.45–50 మధ్య ఉన్న సన్న బియ్యం ప్రస్తుతం రూ.60–70కు చేరింది. కిలోపై సగటున రూ.10 నుంచి రూ.20 వరకు పెరుగుదల నమోదైంది. దేశీయ మార్కెట్‌లో వరి కొనుగోలు ధర క్వింటాల్‌కు రూ.800–900 వరకు పెరగడం ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. దీనికి తోడు రవాణా, మిల్లింగ్, ప్రాసెసింగ్ ఖర్చులు పెరగడంతో ఆ భారం చివరకు వినియోగదారులపైనే పడుతోంది.
బాస్మతి ఎగుమతులపై ప్రభావం
అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కూడా బియ్యం మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా భారత బాస్మతి బియ్యం ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడినట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. భారత్‌లో ఉత్పత్తయ్యే బాస్మతి బియ్యంలో గణనీయమైన భాగం విదేశాలకు ఎగుమతి అవుతోంది. అయితే ప్రధాన ప్రాసెసింగ్ కేంద్రాల నుంచి పోర్టులకు సరుకు తరలింపు, కంటైనర్ల లభ్యత, సముద్ర రవాణా వ్యయాల పెరుగుదల వంటి అంశాలు ఎగుమతిదారులకు సవాలుగా మారాయి.
కృత్రిమ కొరతపై ఆరోపణలు
స్థానిక మార్కెట్లలో ధరల పెరుగుదలకు అక్రమ నిల్వలు కూడా కారణమవుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు హోల్‌సేల్ వ్యాపారులు, మిల్లర్లు సిండికేట్‌గా ఏర్పడి నిల్వలు దాచిపెట్టి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో సన్న ధాన్యం దిగుబడి ఉన్నప్పటికీ.. కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలకు చెందిన వ్యాపారులు భారీగా ధాన్యాన్ని కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తరలించడం కూడా స్థానికంగా ధరలపై ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇంధన ధరల పెరుగుదలతో రవాణా వ్యయాలు కూడా పెరగడంతో ఉత్పత్తిదారుడి వద్ద పెరిగిన ధర చిల్లర మార్కెట్‌కు చేరేసరికి మరింత భారంగా మారుతోంది. ధరల పెరుగుదల ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో బియ్యం కొనుగోలు సామాన్య కుటుంబాలకు మరింత భారంగా మారే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
