రేపు సధర్మాట్ ప్రధాన కాలువకు సాగునీరు
- ఖానాపూర్, కడెం రైతులకు ఊరట.. ఎనిమిది అడుగులకు చేరిన నీటిమట్టం
- ఆయకట్టు చివరి భూముల వరకు నీరందించడమే లక్ష్యం: ఏఎంసీ చైర్మన్ భూషణ్
ఖానాపూర్ టౌన్, ఆంధ్రప్రభ : ఖానాపూర్, కడెం మండలాల రైతులకు జీవనాధారమైన సధర్మాట్ ఆనికట్ నుంచి ఆదివారం ప్రధాన కాలువకు సాగునీటిని విడుదల చేయనున్నట్లు ఏఎంసీ చైర్మన్ భూషణ్ తెలిపారు. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ చేతుల మీదుగా నీటిని విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
సధర్మాట్ ఆనికట్ వద్ద ప్రస్తుతం ఎనిమిది అడుగుల నీటిమట్టం ఉందని భూషణ్ తెలిపారు. ఆయకట్టు చివరి గల్మ వరకు సాగునీరు అందించడమే లక్ష్యంగా నీటి విడుదల చేపడుతున్నట్లు పేర్కొన్నారు. సాగునీటి లభ్యతకు అనుగుణంగా రైతులు పంటలను ప్రణాళికాబద్ధంగా సాగు చేసుకోవాలని సూచించారు.
అధికారుల సూచనలు పాటిస్తూ సాగునీటిని పొదుపుగా వినియోగించుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. నీటి వృథాను అరికట్టి ఆయకట్టులోని అన్ని ప్రాంతాలకు సమానంగా సాగునీరు అందేలా సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు జంగిలి శంకర్, గొర్రె గంగాధర్, కౌన్సిలర్లు రాజుర సత్యం, నిమ్మల రమేష్, ఆత్మ కమిటీ చైర్మన్ తోట సత్యం, మాజీ పీఏసీఎస్ చైర్మన్లు శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్, నాయకులు రాజునాయక్, దయానంద్, అంకం రాజేందర్, కడార్ల గంగనర్సయ్య, బోదాసు సాయిరాం తదితరులు పాల్గొన్నారు.
