వైద్య సేవలకు టిమ్స్ సిద్ధం..
- త్వరలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం
- హాస్పిటల్‌లో ఏర్పాట్లను పరిశీలించిన ఆరోగ్యశాఖ మంత్రి
- మిగిలిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి: మంత్రి దామోదర్ రాజనర్సింహ
హైదరాబాద్, ఆంధ్రప్రభ : ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (డా.ఎంసీఆర్ టిమ్స్) సిద్ధంగా ఉందని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా టిమ్స్‌ను త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.
హాస్పిటల్ ప్రారంభానికి సంబంధించిన ఏర్పాట్లు, మౌలిక వసతులు, వైద్య సేవలు, సిబ్బంది, భద్రత తదితర అంశాలను పరిశీలించేందుకు మంత్రి దామోదర్ రాజనర్సింహ శనివారం డా.ఎంసీఆర్ టిమ్స్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా హాస్పిటల్‌లోని ఏ, బీ, సీ బ్లాకులను పరిశీలించారు. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది, ఉద్యోగులతో మాట్లాడి సేవల నిర్వహణకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ప్రారంభానికి ముందు పూర్తిచేయాల్సిన పనులు, అవసరమైన ఏర్పాట్లపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. మిగిలిన పనులన్నింటినీ యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి హాస్పిటల్‌ను పూర్తిస్థాయి సేవలకు సిద్ధం చేయాలని ఆరోగ్యశాఖ, రహదారులు-భవనాల శాఖతో పాటు ఇతర విభాగాల అధికారులను ఆదేశించారు. హాస్పిటల్ ప్రారంభమైన తొలిరోజు నుంచే రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసేలా ముందస్తు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచించారు.
వైద్య సేవల నిర్వహణతో పాటు మౌలిక వసతులు, మానవ వనరులు, ఇతర సహాయక సేవలు, విద్యుత్, నీటి సరఫరా, పారిశుధ్యం, భద్రత, అగ్నిమాపక భద్రత తదితర అంశాలపై మంత్రి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. హాస్పిటల్‌లోని ప్రతి విభాగం ప్రారంభానికి ముందే పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు.
రోగులకు నాణ్యమైన వైద్యం అందించడంతో పాటు అవసరమైన అన్ని సహాయక సేవలు నిరంతరాయంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వైద్యులు, నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది, సాంకేతిక నిపుణులు, పరిపాలనా సిబ్బంది తదితర మానవ వనరులను అవసరానికి అనుగుణంగా అందుబాటులో ఉంచాలని సూచించారు.
రాష్ట్ర ప్రజలకు అత్యాధునిక, నాణ్యమైన సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించే ప్రముఖ ప్రభుత్వ వైద్య సంస్థగా డా.ఎంసీఆర్ టిమ్స్‌ను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని మంత్రి తెలిపారు. అత్యాధునిక వైద్య పరికరాలు, ఆధునిక మౌలిక వసతులు, సూపర్ స్పెషాలిటీ విభాగాలు, అత్యవసర వైద్యం, తీవ్ర అనారోగ్య చికిత్స, అవయవ మార్పిడి వంటి క్లిష్టమైన వైద్య సేవలను ఒకే వేదికపై అందించేలా టిమ్స్‌ను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లక్ష్యానికి అనుగుణంగా డా.ఎంసీఆర్ టిమ్స్‌ను అభివృద్ధి చేస్తున్నామని దామోదర్ రాజనర్సింహ పేర్కొన్నారు. టిమ్స్‌లో పూర్తిస్థాయిలో సేవలు అందుబాటులోకి వస్తే హైదరాబాద్‌లోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రులపై రోగుల ఒత్తిడి తగ్గడంతో పాటు సూపర్ స్పెషాలిటీ వైద్యం అవసరమైన వారికి మరిన్ని అవకాశాలు లభిస్తాయని అన్నారు.
“డా.ఎంసీఆర్ టిమ్స్ ప్రజలకు నాణ్యమైన, అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉంది. హాస్పిటల్ ప్రారంభానికి సంబంధించిన మిగిలిన ఏర్పాట్లను వేగంగా పూర్తి చేస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా త్వరలోనే హాస్పిటల్‌ను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తాం. ప్రారంభం నుంచే రోగులకు అత్యుత్తమ వైద్య సేవలు అందేలా అన్ని విభాగాలను పూర్తిస్థాయిలో సిద్ధం చేస్తున్నాం” అని మంత్రి తెలిపారు.
