40 ఏళ్ల అనుబంధం..
తుమ్మలకు పామాయిల్ రైతుల ఆత్మీయ ఆహ్వానం
ప్రత్యేక రైతుల సమ్మేళనానికి రావాలని ములకలపల్లి రైతుల వినతి
దమ్మపేట, ఆంధ్రప్రభ : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పామాయిల్ రైతుల మధ్య నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆత్మీయ అనుబంధం శుక్రవారం దమ్మపేట మండలం గండుగులపల్లిలో మరోసారి ఆవిష్కృతమైంది. తమ అభిమాన నాయకుడిని కలిసేందుకు ములకలపల్లి మండలానికి చెందిన పామాయిల్ రైతులు పెద్ద సంఖ్యలో గండుగులపల్లికి చేరుకుని ఆత్మీయంగా ఆహ్వానించారు.
దశాబ్దాలుగా తమకు అండగా నిలిచి, పామాయిల్ సాగు అభివృద్ధికి కృషి చేసి తమ జీవితాల్లో వెలుగులు నింపిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసిన రైతులు భావోద్వేగానికి లోనయ్యారు.
40 ఏళ్ల ప్రజా సేవకు అభినందనలు
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రజా జీవితంలోకి అడుగుపెట్టి 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రైతులు ఆయనను ఘనంగా అభినందించారు. వ్యవసాయ రంగానికి, ముఖ్యంగా పామాయిల్ రైతులకు అందించిన ప్రోత్సాహం, నిరంతర సహకారం తమ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ములకలపల్లిలో “రైతుల ఆత్మీయ సమ్మేళనం” నిర్వహిస్తున్నామని, ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై తమ ఆతిథ్యాన్ని స్వీకరించాలని మంత్రిని హృదయపూర్వకంగా ఆహ్వానించారు.
రైతులు చూపిన అభిమానాన్ని చూసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా భావోద్వేగానికి గురయ్యారు. పదవులు ఉన్నా లేకున్నా తనను గుండెల్లో పెట్టుకుని ఆదరిస్తున్న రైతుల ప్రేమాభిమానాలు నిజమైన ప్రజా నాయకుడికి లభించే గొప్ప ఆస్తి అని అక్కడి వాతావరణం ప్రతిబింబించింది. రాజకీయాలకు అతీతంగా నాయకుడికి, రైతులకు మధ్య ఉన్న ఆత్మీయ బంధానికి గండుగులపల్లి వేదికగా నిలిచింది.
