ఉత్తమ సేవలతో ఉద్యోగులకు గుర్తింపు
- స్వాతంత్య్ర వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఐటీడీఏ పీవో
- గిరిజనుల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు: అధికారులు
- ఉత్తమ సేవలు అందించిన అధికారులకు ప్రశంసాపత్రాలు
ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఉద్యోగులు అందించే సేవలను బట్టి సమాజంలో గుర్తింపుతో పాటు ఉత్తమ అవార్డులు లభిస్తాయని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఉట్నూర్ ఐటీడీఏ పీవో మందమకరందు అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటీడీఏలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఐటీడీఏ పీవో మందమకరందు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గిరిజనుల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, ఇందుకు అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారం అవసరమని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వ హయాంలో గిరిజనుల అభివృద్ధికి అనేక నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి అధికారులు చేస్తున్న కృషి ప్రశంసనీయమని అన్నారు. ఐటీడీఏ పరిధిలోని వివిధ శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన అధికారులకు, ఉద్యోగులకు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, పీవో మందమకరందు కలిసి ప్రశంసాపత్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఉట్నూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అనిత శ్రీనివాస్ జాదవ్, ఉట్నూర్ ఐటీడీఏ ఏపీవో వసంతరావు జాదవ్, పీవీటీజీ ఏపీవో ఆత్రం భాస్కర్, ఏజెన్సీ వైద్యాధికారి కుడిమేత మనోహర్, ఏజెన్సీ డిప్యూటీ విద్యాశాఖ అధికారి గోడం చందన్, జీసీసీ డీఎం గుడిమల్ల సందీప్ కుమార్, జిల్లా క్రీడల అధికారి పార్థసారథి, ఐటీడీఏ ఈఈ తానాజీ జాదవ్, ఐటీడీఏ వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.
