గంజాయి రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: డీఎస్పీ కృష్ణ కిశోర్

తొర్రూరులో పోలీసుల భారీ బైక్ ర్యాలీ

తొర్రూరు రూరల్, ఆంధ్రప్రభ: గంజాయి రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తొర్రూరు డీఎస్పీ కృష్ణ కిశోర్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని, గంజాయి రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా శుక్రవారం తొర్రూరు పట్టణంలో డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు భారీ అవగాహన బైక్ ర్యాలీ నిర్వహించారు.

అనంతరం స్థానిక బస్టాండ్ సెంటర్ వద్ద పోలీసులు మానవహారంగా ఏర్పడి, మాదకద్రవ్యాల నిర్మూలనకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ కృష్ణ కిశోర్ మాట్లాడుతూ… యువత గంజాయి వంటి మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. వ్యసనాల వల్ల వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సమాజపరంగా తీవ్ర నష్టం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

గంజాయి నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకం. ఎక్కడైనా గంజాయి విక్రయాలు, అక్రమ రవాణా లేదా వినియోగం జరుగుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలి. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని డీఎస్పీ పేర్కొన్నారు.

సమాజాన్ని మాదకద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. కాగా, సమాజంలో చెడుదారి వైపు త్వరగా ఆకర్షితులయ్యే యువతను కూడా ఇటువంటి అవగాహన కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున భాగస్వాములను చేసి ఉంటే మరింత బాగుండేదని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో తొర్రూరు సీఐ, మరిపెడ సీఐలతో పాటు వివిధ పోలీస్ స్టేషన్ల ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.