160 కిలోమీటర్ల అల్ట్రా రన్, సైక్లింగ్ ఛాలెంజ్
‘రన్ ఫర్ ఫ్రీడమ్.. రైడ్ ఫర్ ప్రైడ్’ నినాదంతో గోవింద్ రాజు సాహసం.. అభినందించిన మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం (ఆంధ్రప్రభ): జాతీయ అథ్లెట్, మోడ్రన్ పెంటాథ్లాన్ జాతీయ క్రీడాకారుడు గోవింద్ రాజు కొక్కిరిపాటి (రాజు కె) చేపట్టిన 160 కిలోమీటర్ల అల్ట్రా రన్ & సైక్లింగ్ ఛాలెంజ్‌ను రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజల్లో దేశభక్తి, ఆరోగ్యంపై అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో ‘రన్ ఫర్ ఫ్రీడమ్.. రైడ్ ఫర్ ప్రైడ్’ నినాదంతో ఈ ఛాలెంజ్‌ను చేపట్టారు. మచిలీపట్నంలోని ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, జెండావీరుడు తోట నరసయ్య నివాసం వద్ద మంత్రి రవీంద్ర ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
శుక్రవారం రాత్రి మచిలీపట్నం నుంచి ప్రారంభమైన అల్ట్రా రన్ ఆదివారం ఉదయం విజయవాడ ఇంద్రకీలాద్రి వరకు కొనసాగనుంది. అనంతరం అక్కడి నుంచి మచిలీపట్నం వరకు 80 కిలోమీటర్ల మేర సైక్లింగ్ నిర్వహించనున్నారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి రవీంద్ర గోవింద్ రాజును అభినందించి, ఆయనతో కలిసి కొంతదూరం పరుగు తీశారు. 38 ఏళ్ల వయసులో 160 కిలోమీటర్ల రన్, సైక్లింగ్ చేపట్టడం సాహసోపేతమైన కార్యక్రమమని మంత్రి కొనియాడారు. యువత గోవింద్ రాజును స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఇలాంటి క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారు. గోవింద్ రాజు చేపట్టిన ఈ యాత్ర తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ డా. హసీమ్ బేగ్, జనసేన నాయకులు మాదివాడ రాము, శిష్టకరణ సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షుడు అక్కమహంతి రాజా, జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్ ఝాన్సీ లక్ష్మి, పరిశీలకుడు సాయి, టీడీపీ నాయకులు ఊకంటి రాంబాబు, బండారు నాని, అబ్దుల్ అజీమ్, ఫిరోజ్, అమ్మిశెట్టి శివయ్య తదితరులు పాల్గొన్నారు.
