The grain | ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలి..

The grain | కొల్లిపర, ఆంధ్రప్రభ : రైతులు హార్వెస్ట్ (నూర్పిడి) చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని గుంటూరు జాయింట్ కలెక్టర్ ఆశుతోష్ శ్రీవాత్సవ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మండల పరిధిలోని తూములూరు రైతు సేవా కేంద్రాన్ని శనివారం శ్రీ వాత్సవ పరిశీలించారు. ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మండలంలో తూములూరు, కొల్లిపర, చివలూరు, దావులూరు, చక్రాయపాలెం తదితర క్లస్టర్లలో 580 మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వాతావరణ శాఖ తుఫాన్ హెచ్చరికలు చేయటంతో రైతులందరూ సుమారు 5 వేల మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని హార్వెస్ట్ చేసి రోడ్లపై ఆరబోశారని చెప్పారు.

మండలంలో 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి ఉన్నదని అన్నారు. రైతులకు దాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా, గోతాలు, లారీల రవాణా సౌకర్యం , జీపీఎస్ సమస్య తలెత్తకుండా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రభుత్వ యంత్రాంగానికి పలు సూచనలను చేశారని వెల్లడించారు. కృష్ణ, గుంటూరు, బాపట్ల జిల్లాలలో ధాన్యం పండించిన పంట కోతకు రావడంతో గోతాలు, టార్పాలీన్ పట్టాలు, రైతులకు సమస్యలు వచ్చినట్లయితే వెంటనే మండల స్థాయి అధికారులకు తెలియపరచాలని అన్నారు. వీరి వెంట తహసిల్దార్ జి సిద్ధార్థ, జనసేన నాయకులు అడపా నారాయణరెడ్డి, వీఆర్వో రామారావు, ఉపసర్పంచ్ ,స్థానిక రైతులు, తదితరులు వెంట ఉన్నారు.

Leave a Reply