పాఠశాలల్లో ప్రాచీన క్రీడ మల్లఖంబ్ ను ప్రోత్సహించాలి
- వైభవంగా ముగిసిన రాష్ట్రస్థాయి శిక్షణ శిబిరం
- జీవో 74 పరిధిలోకి తెచ్చేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా
- కృష్ణమూర్తి, వెన్ రెడ్డి రాజు
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : భావితరాలకు ఆరోగ్యాన్ని, మానసిక ఉల్లాసాన్ని ప్రసాదించే ప్రాచీన క్రీడ మల్లఖంబ్ ను రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర వ్యాయామ ఉపాధ్యాయ సంఘం కార్యదర్శి కృష్ణమూర్తి, రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్స్ మాజీ చైర్మన్ వెన్ రెడ్డి రాజు పిలుపునిచ్చారు.
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని ట్రినిటీ హైస్కూల్‌లో నిర్వహించిన రెండు రోజుల తెలంగాణ రాష్ట్రస్థాయి మల్లఖంబ్ శిక్షణ తరగతులు ఆదివారం ఘనంగా ముగిశాయి. ముగింపు సమావేశానికి ముఖ్యఅతిథులుగా హాజరైన కృష్ణమూర్తి, వెన్ రెడ్డి రాజు లు శిక్షణ పూర్తి చేసుకున్న శిక్షకులకు సర్టిఫికెట్లు అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రెండు రోజుల పాటు పొందిన శిక్షణను పాఠశాల విద్యార్థులకు అందించి ఈ ప్రాచీన విద్యను పునరుజ్జీవింపజేయాలని కోరారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన క్రీడల జీవో 74 లో మల్లఖంబ్ క్రీడ లేదని, రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఈ క్రీడను అధికారికంగా గుర్తించేలా కృషి చేస్తామన్నారు. విద్యార్థులు మల్లఖంబ్ నేర్చుకోవడం వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఏకాగ్రత పెరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ట్రినిటీ హైస్కూల్ చైర్మన్ కేవీబీ కృష్ణారావు, అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు, ట్రినిటీ పాఠశాల డైరెక్టర్ డాక్టర్ ఉజ్జిని మంజుల, కార్యదర్శి గోపాల్, కోశాధికారి పోలే అంజయ్య, శిక్షకులు కిరణ్, వెంకట్, కృష్ణమూర్తి, నరేష్, సందీప్, స్వాతి, స్వరూప, సుమతి, అరుణ, నందిని, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
