ఇప్పుడే నీళ్లు వస్తున్నాయని వరి వేసి ఇబ్బందులు పడొద్దు
రైతులు ఆలోచించి ఆరుతడి, పామాయిల్ పంటలు సాగు చేయాలి: కలెక్టర్ ఆదర్శ్ సురభి
పెద్దమందడి, ఆంధ్రప్రభ: ప్రస్తుత పరిస్థితుల్లో నీళ్లు అందుబాటులో ఉన్నాయని తొందరపడి వరి సాగు చేసి రానున్న రోజుల్లో ఇబ్బందులు పడొద్దని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి రైతులకు సూచించారు. వర్షాలు తగ్గిపోయే అవకాశం ఉన్నందున రైతులు ముందుచూపుతో ఆరుతడి, పామాయిల్, కూరగాయల పంటల వైపు దృష్టి సారించాలని కోరారు.
ప్రతి మంగళవారం నిర్వహించే రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా మంగళవారం పెద్దమందడి రైతు వేదికలో రైతులకు శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని, ప్రస్తుతం నీరు అందుబాటులో ఉందని వరి నార్లు వేసుకోవడం సరికాదన్నారు.
గత ఏడాది ఆగస్టు నాటికి పెద్దమందడి మండలంలో 100 సెంటీమీటర్ల వర్షపాతం నమోదుకాగా, ఈ ఏడాది ఇప్పటివరకు 76 సెంటీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైందని తెలిపారు. గత ఏడాది మండలంలో 22 వేల ఎకరాల్లో పంటలు సాగు చేయగా, అందులో 18 వేల ఎకరాల్లో వరి సాగు చేసినట్లు వివరించారు. ఈ ఏడాది వరి సాగుకు అవసరమైన స్థాయిలో నీరు అందే అవకాశం లేదని పేర్కొన్నారు. భూగర్భ జలాలు కూడా తగ్గుతున్నందున రానున్న రోజుల్లో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందన్నారు.
రైతులు వేరుశనగ, మినుములు, కూరగాయలు వంటి ఆరుతడి పంటలతో పాటు పామాయిల్ సాగుపై దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. ఆరుతడి పంటలకు అవసరమైన మేలురకం, లాభదాయకమైన విత్తనాలను పంపిణీ చేసేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నట్లు తెలిపారు.
జిల్లా ఉద్యానవన శాఖ అధికారి విజయభాస్కర్ మాట్లాడుతూ పామాయిల్ సాగును ప్రభుత్వం అధిక సబ్సిడీతో ప్రోత్సహిస్తోందన్నారు. వరి సాగుకు ఒక ఎకరాకు వినియోగించే నీటితో పామాయిల్‌ను మూడు ఎకరాల్లో సాగు చేయవచ్చని తెలిపారు. ఎకరాకు ఐదు నుంచి ఏడు టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు. కూరగాయల సాగుకు ప్రభుత్వం ఎకరానికి రూ.9,600 సబ్సిడీ అందిస్తోందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
రైతు వెంకటరెడ్డి మాట్లాడుతూ.. గతంలో వనపర్తి జిల్లాలో ఆరుతడి పంటలే ఎక్కువగా సాగు చేసేవారని, సాగునీటి లభ్యత పెరగడంతో రైతులు వరి సాగుకు అలవాటు పడ్డారని తెలిపారు. వరికి గిట్టుబాటు ధరతో పాటు ప్రభుత్వం బోనస్ ఇస్తున్నందున ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు ఎందుకు వెళ్తారని ప్రశ్నించారు. ఆరుతడి పంటలకు నాణ్యమైన విత్తనాలతో పాటు ప్రోత్సాహకాలు అందించాలని కోరారు.
మండల వ్యవసాయ అధికారి సైదులు, సర్పంచ్ సూర్యగంగమ్మ తదితరులు రైతులు ఆరుతడి పంటల వైపు మళ్లాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మల్లికార్జున్, ఎంపీడీవో పర్ణిత, మాజీ సింగిల్ విండో చైర్మన్ సత్యారెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.
