TG | రేవంత్ పై ఈడీ ఎఫ్ ఐ ఆర్ ..సిఎం ప‌ద‌వికి రాజీనామా చేయాలన్న కెటిఆర్

ముఖ్య‌మంత్రిపై కేసు న‌మోదుతో తెలంగాణ ప‌రువుల గంగ‌లోకి
తెలంగాణ సంప‌దంతా ఢిల్లీ బాసుల‌కే
రూ.50 కోట్ల‌తో పిసిసి పోస్ట్ కొనుకున్న వ్య‌క్తి రేవంత్
బీఆర్ఎస్ పై నిందలు.. బిల్డర్లతో దందాలు..
ఢిల్లీ పెద్దలకు చందాలు..ఇదే రేవంత్ పాల‌న
ఒక్క ప్రాజెక్ట్ చేప‌ట్ట‌కుండానే రూ.1.80 ల‌క్ష‌ల కోట్ల అప్పులు
కాంగ్రెస్ డీఎన్ఏలోనే కరప్షన్ ఉందని తీవ్ర ఆరోపణ
క‌విత రాసిన లేఖ‌పై స్పందించిన బిఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్
లేఖ‌లు రాయ‌డం స‌హ‌జం..అవి బ‌హిర్గంతం కావ‌డ‌మే దుర‌దృష్ట‌క‌రం

హైద‌రాబాద్ – ఈడీ ఛార్జిషీటులో తెలంగాణ సీఎం పేరు రావడం రాష్ట్రానికే అవమానకరమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్లో నేడు మీడియా తో మాట్లాడుతూ, . నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసు లో సీఎం రేవంత్ రెడ్డి పేరు రావడంపై స్పందిస్తూ, . రేవంత్ మాటల ముఖ్యమంత్రి కాదు..మూటల ముఖ్యమంత్రి అని దుయ్యబట్టారు. మూటలు మోసే పీసీసీ అధ్యక్ష పదవి తెచ్చుకున్నారని విమర్శించారు. అందుకే ఆయనకు బ్యాగ్ మ్యాన్ అనే పేరొచ్చిందన్నారు.

యంగ్ ఇండియా పేరుతో వసూళ్లకు పాల్పడి రూ.50 కోట్లతో పీసీసీ చీఫ్ పదవి కొనుక్కున్నట్లు కాంగ్రెస్ వాళ్లే చెప్తున్నారన్నారు. నాలుగుకోట్ల మంది ప్రజలకు నాయకత్వం వహించే పదవిలో ఉన్న రేవంత్ రెడ్డికి నిజాయితీ, నైతికత ఉంటే వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే కాంగ్రెస్ పార్టీ పెద్దలు స్పందించి రేవంత్ రెడ్డితో రాజీనామా చేయించి, ఈ కేసులో నిష్పక్షపాతంగా విచారణ చేయాలని డిమాండ్ చేశారు . ఓటుకు నోటు కేసును తెలంగాణ ప్రజలు ఇంకా మర్చిపోలేదని కేటీఆర్ చెప్పారు. ఈ కేసు తర్వాత రేవంత్ రెడ్డి మారిపోయాడని తాము భావించామన్నారు. అయితే, కుక్క తోక వంకర, దానిని ఎవరూ సరిచేయలేరన్నట్లు ఆయన మారలేదని కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ సంప‌ద అంతా ఢిల్లీకే ..

తెలంగాణ సంపదను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి దోచిపెడుతున్నారని మాజీమంత్రి, బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రం ఏటీఎంగా మారిందని అన్నారు. రేవంత్ రెడ్డి పాలన ‘బీఆర్ఎస్ పై నిందలు.. బిల్డర్లతో దందాలు.. ఢిల్లీ పెద్దలకు చందాలు’ అన్న చందంగా నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి మాటల మనిషి కాదు మూటల మనిషి అని ఆ పార్టీ నేతలే ఆరోపిస్తున్నారని, అది నిజమని తాజాగా తేలిందని చెప్పారు. కాంగ్రెస్ డీఎన్ఏలోనే కరప్షన్ ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు.

మీ డిమాండ్ తోనే యుడియ‌ర‌ప్ప సిఎం పోస్ట్ కు రాజీనామా

నీతి, నిజాయితీ ఉంటే రేవంత్ రెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తిపై అవినీతి ఆరోపణలు వస్తే దర్యాప్తు పారదర్శకంగా జరగాలంటే పదవి నుంచి తప్పుకోవాలని ఇదే కాంగ్రెస్ లీడర్లు కర్ణాటకలో ఆరోపించారని కేటీఆర్ గుర్తుచేశారు. కాంగ్రెస్ డిమాండ్లకు స్పందించిన యడియూరప్ప అప్పట్లో తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారని గుర్తు చేశారు..

44 సార్లు ఢిల్లీ వెళ్లిన రేవంత్

కేవలం 16-17 నెలల్లో 44సార్లు ఢిల్లీకి వెళ్లిన సీఎంగా రేవంత్ రెడ్డి అరుదైన రికార్డు సాధించారన్నారు కెటిఆర్ . రేవంత్ అన్నిసార్లు ఢిల్లీకి వెళ్లడానికి కారణం తమకు కూడా ఇప్పుడే అర్థమైందని, నన్ను అరెస్ట్ చేయకండి అని చీకట్లో ఢిల్లీ పెద్దల కాళ్లు పట్టుకుని, నాపై కేసులు వేయకండి అని బతిమాలుతున్నారని ఎద్దేవా చేశారు. ఒక్క ఇటుక పేర్చకుండా, ఒక్క ప్రాజెక్ట్ కట్టకుండా, ఒక్క సంక్షేమ పథకం అమలు చేయకుండా తెలంగాణలో లక్ష 80వేల కోట్ల రూపాయల అప్పు ఎందుకు చేశారో, ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్తుందో ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. సీఎం అయ్యాక కూడా రేవంత్ బుద్ధి, వైఖరి మారలేదని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజలను దోచి, ఏటీఎంగా మార్చి.. ఢిల్లీ బాసులకు అప్పజెప్తున్నారన్నారు.

రాహుల్ జీ మౌన‌మేల ?

ప్రతి విషయంలో మాట్లాడే రాహుల్ గాంధీ.. నేషనల్ హెరాల్డ్ కేసులో సీఎం రేవంత్ రెడ్డి పేరు రావడంపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మరోవైపు రేవంత్ కూడా ఈ విషయంపై స్పందించకుండా జపాన్ కు వెళ్లారని, ఇంటెలిజెన్స్ సమాచారంతోనే నాడు జపాన్ కు వెళ్లొచ్చారని విమర్శించారు. తెలంగాణ ప్రధాన ప్రతిపక్షంగా, ప్రజల తరపున సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. అవినీతి ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడంపై కాంగ్రెస్ ఆలోచించాలని అన్నారు.. రేవంత్ రాజీనామా చేయ‌క‌పోతే కాంగ్రెస్ సీనియ‌ర్లే అత‌డిపై వ‌త్తిడి తెచ్చి రాజీనామా చేయించాల‌ని సూచించారు కెటిఆర్.

పొంగులేటిపై ఈడీ దాడులు జ‌రిగినా

మంత్రి పొంగులేటి ఇంటిపై జరిగిన దాడులపై మాట్లాడిన కేటీఆర్.. 2024 సెప్టెంబర్ లో మంత్రి పొంగులేటి నివాసంలో రెయిడ్ జరగ్గా.. ఇప్పటి వరకూ దానికి సంబంధించి ఎలాంటి వివరణ ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ మంత్రుల్ని కాపాడేందుకు బీజేపీ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఎందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారని ప్రశ్నించారు. కర్ణాటకలో జరిగిన వాల్మీకి స్కామ్ కు సంబంధించి తెలంగాణకు రూ.45 కోట్లు వచ్చినా కాంగ్రెస్ నేతల పేర్లు కూడా బయటికి రానివ్వలేదని, ఏం జరుగుతుందో ఎవరికీ తెలియనివ్వలేదన్నారు. కర్ణాటక రిమాండ్ డైరీలో వాల్మీకి కుంభకోణం గురించి రాసిన ఈడీ.. ఇక్కడ మాత్రం మాట మాట్లాడట్లేదని, ఇదంతా ఒక బ్రహ్మ రహస్యంగా ఉందన్నారు.

రేవంత్ స‌ర్కార్ ను కాపాడుతున్న బిజెపి

సివిల్ సప్లై స్కామ్ ను బయటపెట్టినా.. దానిపై ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా , కేంద్ర ప్రభుత్వం, ఏ ఏజెన్సీ కూడా స్పందించకపోవడం గమనార్హం. అమృత్ స్కామ్ లో రేవంత్ రెడ్డి బావమరిది కంపెనీకి రూ.1135 కోట్ల వర్క్ ఇచ్చారని ఆరోపించామని, కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు వివరంగా చెప్పినా ఇంతవరకూ ఈ విషయంపై స్పందించలేదన్నారు. బీజేపీకి నిజాయితీ ఉంటే ఈ స్కామ్ లపై స్పందించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలు కూడా ఎవరు ఎవరితో కుమ్మక్కవుతున్నారని గ్రహించాలని సూచించారు. బిజెపి లోపాయ‌కారిగా రేవంత్ స‌ర్కార్ ను కాపాడుతుందంటూ కెటిఆర్ ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *