ప్రజలకు పోలీసుల సేవలు మరింత చేరువ కావాలి
పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి
మల్హర్, ఆంధ్రప్రభ: ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ నిష్పాక్షికంగా సేవలు అందించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ పోలీసు అధికారులను ఆదేశించారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడి సమస్యను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల నుంచి అందే ప్రతి ఫిర్యాదును వెంటనే ఆన్లైన్లో నమోదు చేసి, పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని ఆదేశించారు.
వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం కొయ్యూరు పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ సంకీర్త్ సందర్శించారు. స్టేషన్‌కు చేరుకున్న ఎస్పీకి పోలీసు సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. అనంతరం వన మహోత్సవంలో భాగంగా పోలీస్‌స్టేషన్ ఆవరణలో మొక్క నాటారు.
రికార్డుల నిర్వహణపై ఆరా
పోలీస్‌స్టేషన్ పరిసరాలను పరిశీలించిన ఎస్పీ పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, సిబ్బంది విధుల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. రోడ్డు ప్రమాద కేసులకు సంబంధించిన వాహనాల పరిస్థితి, వాటి పరిష్కార పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. స్వీకరణ విభాగంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో మాట్లాడి ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు.
పెండింగ్ కేసులపై సమీక్ష
స్టేషన్లో నమోదైన పెండింగ్ కేసుల పురోగతిని ఎస్పీ సమీక్షించారు. కేసుల దర్యాప్తును వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేస్తూ కేసు రికార్డులను నవీకరించాలని సూచించారు. స్టేషన్, కేసు రికార్డులను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.
రౌడీషీటర్లపై నిరంతర నిఘా
రౌడీషీటర్లపై తీసుకుంటున్న చర్యలను ఎస్పీ సమీక్షించారు. వారిపై నిరంతరం నిఘా కొనసాగిస్తూ, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రతి పౌరుడికి స్నేహపూర్వక వాతావరణం కల్పించి, వారి సమస్యలను వేగవంతంగా, పారదర్శకంగా పరిష్కరించాలని ఆదేశించారు.
ప్రజల్లో పోలీసుశాఖపై విశ్వాసాన్ని మరింత పెంపొందించడమే లక్ష్యంగా అధికారులు, సిబ్బంది పనిచేయాలని ఎస్పీ సంకీర్త్ సూచించారు.
ఈ వార్షిక తనిఖీల్లో కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, కాటారం సీఐ నాగార్జునరావు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
