ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు
నిర్ణీత గడువులో సమస్యలు పరిష్కరిస్తాం : తహసీల్దార్ అరుణ
ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ: ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదులను నిర్ణీత సమయంలో పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ఉరవకొండ తహసీల్దార్ అరుణ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీగ్రెస్) ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, సంబంధిత శాఖల సమన్వయంతో పరిష్కారం చూపుతున్నట్లు వెల్లడించారు.
గత 30 రోజుల్లో ప్రజల నుంచి మొత్తం 10 పీగ్రెస్ ఫిర్యాదులు అందినట్లు తహసీల్దార్ తెలిపారు. వీటిలో పౌర సరఫరాల శాఖకు సంబంధించినవి ఒకటి, ధ్రువపత్రాల జారీకి సంబంధించినవి రెండు, భూ సమస్యలు ఒకటి, ఆర్‌ఓఆర్ (రికార్డ్ ఆఫ్ రైట్స్) సంబంధిత సమస్యలు ఐదు, ఇళ్ల స్థలాలకు సంబంధించినవి రెండు ఉన్నట్లు పేర్కొన్నారు.
ఇప్పటివరకు వచ్చిన ఫిర్యాదుల్లో నాలుగు సమస్యలను పరిష్కరించినట్లు ఆమె తెలిపారు. మరో ఆరు ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటి పరిష్కారానికి చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదుల విషయంలో సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేసి, క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి నిబంధనల ప్రకారం పరిష్కారం చూపుతామని తహసిల్దార్ అరుణ పేర్కొన్నారు.
దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పీగ్రెస్ ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా నింబగల్లు గ్రామానికి చెందిన కొంక ప్రహ్లాద సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఫిర్యాదులను వేగంగా పరిష్కరించేందుకు అధికారులు కృషి చేస్తున్నారని తెలిపారు.
