ఇస్లాంపేటలో పోలీసుల కార్డన్ సెర్చ్
63 ద్విచక్ర వాహనాలు, ఆటో స్వాధీనం
నరసరావుపేట క్రైమ్, ఆంధ్రప్రభ: శాంతిభద్రతల పరిరక్షణ, చట్టవ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ, నేరాల కట్టడే లక్ష్యంగా పల్నాడు జిల్లా పోలీసులు నరసరావుపేట 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో లోని ఇస్లాంపేటలో మంగళవారం తెల్లవారుజామున కార్డన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా అదనపు ఎస్పీ రోహిత్‌కుమార్ చౌదరి ఆదేశాల మేరకు, నరసరావుపేట డీఎస్పీ ఎం.హనుమంతరావు పర్యవేక్షణలో ఉదయం 6 గంటలకు ఈ తనిఖీలు చేపట్టారు.
పోలీసు అధికారులు, సిబ్బందిని బృందాలుగా ఏర్పాటు చేసి ఇస్లాంపేటలోని ఇళ్లు, పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేశారు. రౌడీషీటర్లు, ట్రబుల్ మాంగర్స్, పాత కేసుల నిందితులు, అనుమానితులపై ప్రత్యేక నిఘా ఉంచారు. సరైన ధ్రువపత్రాలు లేని 63 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ప్రజలకు అవగాహన
తనిఖీల అనంతరం పోలీసులు ఇస్లాంపేటలో ఫుట్‌పెట్రోలింగ్ నిర్వహించి స్థానికులతో సమావేశమయ్యారు. హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు. మాదకద్రవ్యాల వినియోగంతో కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. అపరిచిత వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తే వెంటనే 112కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.
రాబోయే స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. రౌడీషీటర్లు, ట్రబుల్ మాంగర్స్, అనుమానితులు, పాత కేసుల నిందితులపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని చెప్పారు.
పాత కేసుల నిందితులతో పోలీసులు సమావేశమై ఇకపై నేర ప్రవృత్తికి దూరంగా ఉంటూ సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. అనవసరంగా గొడవలు సృష్టిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఏదైనా సమస్య ఉంటే పోలీసుల దృష్టికి తీసుకురావాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో నరసరావుపేట డీఎస్పీ ఎం.హనుమంతరావు, రెండో పట్టణ సీఐ ప్రభాకర్, ఒకటో పట్టణ సీఐ ఫిరోజ్ , రూరల్ సీఐ సుబ్బారావు తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

