పచ్చని భవిష్యత్‌కు నేటి మొక్కలే పునాది
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: ఎస్పీ శ్రీనివాసరావు
గద్వాల, ఆంధ్రప్రభ: పచ్చదనం పెంపొందించడం, పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని జోగుళాంబ గద్వాల్ జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు అన్నారు. వన మహోత్సవంలో భాగంగా మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయం వెనుక భాగంలో ఎస్పీ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బందికి పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం ప్రాధాన్యంపై అవగాహన కల్పించారు.
చెట్లు ప్రకృతికి మాత్రమే కాకుండా మనిషి భవిష్యత్‌కు కూడా ఎంతో అవసరమని ఎస్పీ తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు వాటిని బాధ్యతగా సంరక్షించాలని సూచించారు. నేడు నాటిన మొక్కలు రేపటి తరాలకు స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తాయని పేర్కొన్నారు.
పోలీస్ కార్యాలయాలు, పోలీస్స్టేషన్ల పరిసరాల్లో అందుబాటులో ఉన్న ప్రదేశాల్లో మొక్కలు నాటి, వాటి సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. మొక్కలు నాటడం ఒక కార్యక్రమంగా మాత్రమే కాకుండా వాటిని సంరక్షించడం నిరంతర బాధ్యతగా భావించాలని అన్నారు.
పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు పోలీస్ శాఖ తరఫున కూడా ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించాలని ఎస్పీ సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ కె. శంకర్, కార్యాలయ ఏఓ సాయి కృష్ణ, ఏఆర్ డీఎస్పీ నరేంద్రరావు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు, జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ల ఎస్ఐలు, పోలీసు సిబ్బంది, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొని మొక్కలు నాటారు.
