పులిగుండాల ప్రాజెక్ట్‌ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం..

పులిగుండాల ప్రాజెక్ట్‌ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం..

  • డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
  • ప్రాజెక్ట్ పరిసరాల్లో కాటేజీల నిర్మాణానికి రూ. 4 కోట్లు మంజూరు
  • కనకగిరి హిల్స్ అభివృద్ధి పనులు ప్రారంభించాలి
  • డిప్యూటీ సీఎం, మంత్రి పొంగులేటి

ఖమ్మం, ఆంధ్రప్రభ : ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం బ్రాహ్మళ్లకుంట గ్రామంలోని పులిగుండాల ట్యాంక్ వద్ద ఏర్పాటు చేసిన పులిగుండాల ప్రాజెక్ట్‌ను దేశంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. డిప్యూటీ సీఎం బుధవారం రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, పీసీసీఎఫ్ సువర్ణ, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సీపీ సునీల్ దత్, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ భీమా నాయక్, జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ విక్రమ్ సింగ్ లతో కలిసి పులిగుండాల ఎకో టూరిజం ప్రాజెక్ట్ ను, బోటింగ్, వాటర్ ఫాల్స్, జంగిల్ సఫారీ లను ప్రారంభించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ… ఈ అందమైన ప్రదేశాన్ని పరిచయం చేసిన స్థానిక ఎమ్మెల్యే, డీఎఫ్ఓలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎకో టూరిజం అభివృద్ధిని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటోందని, తెలంగాణలోని ప్రకృతి సౌందర్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు.

కనకగిరి హిల్స్ అభివృద్ధిని తక్షణమే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పులిగుండాల ప్రాజెక్ట్ నీటి పరిసర ప్రాంతాల్లో రెండు వైపులా కాటేజీల నిర్మాణానికి 4 కోట్లు సీఎస్ఆర్ నిధుల నుండి మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. పనుల అమలుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను వెంటనే సిద్ధం చేసి, పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయి, ఎప్పుడు పూర్తవుతాయి అనే కాలపట్టికను సిద్ధంగా ఉంచాలని అధికారులకు సూచించారు. పర్యాటకులు ఈ ప్రాంతానికి సులభంగా చేరుకునే విధంగా డబుల్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు వెంటనే పంపించాలని ఆదేశించారు. ఈ ప్రాంతంలో ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేస్తే స్థానిక ప్రజలకు విస్తృత స్థాయిలో ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక రంగాన్ని విస్తృతంగా ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. భవిష్యత్తులో పులిగుండాల ప్రాజెక్ట్‌ను దేశంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాలలో ఒకటిగా అభివృద్ధి చేస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు.

మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. కనకగిరి హిల్స్ వంటి అందమైన ప్రాంతాలను సందర్శించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి రాష్ట్రానికి ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎకో టూరిజం క్రింద రాష్ట్రంలో టాప్ 3 గమ్యస్థానాలలో ఒకటిగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి అవసరమైన పూర్తి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని, అన్ని విధాల అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎకో టూరిజం అభివృద్ధిపై పూర్తి దృష్టి సారించిందన్నారు. అలాగే ఈ ప్రాంతానికి వెళ్లే యాక్సెస్ రోడ్డు ను డబుల్ రోడ్డుగా అభివృద్ధి చేయడానికి తక్షణమే అనుమతులు మంజూరు చేస్తామన్నారు.

గత ప్రభుత్వం ప్రారంభించి మిగిలిపోయిన సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులను ప్రస్తుత ప్రభుత్వం వేగంగా పూర్తి చేస్తోందన్నారు. స్థానిక ఎమ్మెల్యే సూచన మేరకు ఆ ప్రాజెక్ట్ నుండి ఈ ప్రాంతానికి నీటిని తీసుకువచ్చి నిరంతర నీటి సరఫరా కల్పించే అవకాశాలను పరిశీలిస్తామని పేర్కొన్నారు. సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసి, సాధ్యమైతే ఈ పనులను పూర్తి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ మాట్లాడుతూ.. చెట్లు లేకుండా జీవనం సాధ్యం కాదని, మనిషి జీవితం చెట్లపై ఆధారపడి ఉందని తెలిపారు. మనకు అవసరమైన ఆక్సిజన్ చెట్ల నుంచే లభిస్తుందని, మనిషి అవసరాలకు ఉపయోగించే మంచం వంటి అనేక వస్తువులు కూడా చెట్ల నుంచే వస్తాయని తెలిపారు. అటవీ సంరక్షణకు ప్రభుత్వం, మంత్రులు ప్రతిష్టాత్మకంగా కృషి చేస్తున్నారని తెలిపారు. కనకగిరి హిల్స్‌కు ఎకో టూరిజం క్రింద నిధులు, నీలాద్రి హిల్స్‌కు దేవాలయ పర్యాటక అభివృద్ధి క్రింద నిధులను డిప్యూటీ సీఎం, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మంజూరు చేయడం జరిగిందన్నారు.
మన చుట్టూ ఉన్న అందమైన ప్రకృతిని కాపాడేందుకు అధికారులు ఎంతో శ్రమిస్తున్నారని తెలిపారు. పులిగుండాల ఎకో టూరిజం ప్రాజెక్ట్ ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు లభించడమే కాకుండా, మన సంస్కృతి, వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం కలుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply